హుస్నాబాద్, వెలుగు: కుటుంబ కలహాలు, పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో అవమానాలు ఎదురుకావడం, తండ్రి కూడా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సాయి స్నేహనగర్‌లో గురువారం జరిగింది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మడికొండకు చెందిన శ్రావణి(34)కి అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన కలబోయిన నాగరాజుతో ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హుస్నాబాద్‌లో నివాసముంటున్నారు.
శ్రావణి స్థానిక డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పనిచేసి ఇటీవల ఉద్యోగం మానేసి, కాంట్రాక్ట్ కండక్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరగగా, ఆ సమయంలో శ్రావణి మామ కొమురయ్య ఆమెపై దాడికి యత్నించినట్లు సమాచారం. అనంతరం తన బాధను తండ్రికి చెప్పేందుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి, గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్తే కారణమంటూ స్టేటస్..
ఆత్మహత్యకు ముందు ‘నా చావుకు కారణం నా భర్తనే’ అంటూ శ్రావణి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
