కేదార్ నాథ్ దారిలో మసాజ్ సెంటర్స్

కేదార్ నాథ్ దారిలో మసాజ్ సెంటర్స్

కేదార్ నాథ్‌ యాత్రికులకు వచ్చే ఏడాది నుంచి మసాజ్‌‌ సెంటర్స్‌‌ను అందుబాటులోకి తేనున్నట్టు ఉత్తరాఖండ్‌‌లోని రుద్రప్రయాగ్‌‌ కలెక్టర్‌‌ మంగేష్ గిల్డియల్ తెలిపారు. 16 కిలోమీటర్ల ట్రెక్‌‌ మార్గంలో ఏడు మసాజ్‌‌ సెంటర్లు ప్లాన్‌‌ చేస్తున్నట్టు చెప్పారు. మసాజ్ కుర్చీలున్న ఈ సెంటర్స్‌‌ను భీంబాలి, లింకోలి, రుద్రపాయింట్, జంగిల్‌‌ చట్టి ప్రాంతాలతో పాటు మరోమూడు చోట్ల ఏర్పాటు చేస్తామన్నారు. ట్రెక్‌‌ మార్గంలో భక్తులు బాగా అలసిపోతున్నారని, వారికి ఈ సెంటర్లలో ఉపశమనం దొరుకుతుందన్నారు. ఈ సీజన్‌‌ ముగిసే వరకు 10 లక్షల మంది యాత్రికులు కేదార్ నాథ్‌ను సందర్శించుకున్నారని కలెక్టర్‌‌ చెప్పారు.

యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంకోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది ఇంతకన్నా ఎక్కువమంది యాత్రికులు రావొచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గౌరీకుండ్‌‌ నుంచి గుర్రాలపై తరలివచ్చే వాళ్లకు హెల్మెట్‌‌ తప్పనిసరి చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.యాత్ర సీజన్‌‌లో కొండ చరియలు విరిగిపడడంతో కొందరు గాయపడుతున్నారని, కొన్నిసార్లు ప్రాణాలుపోయే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.