
- చత్తీస్‌గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ
- ప్రజలు, నిపుణుల నుంచి వివరాలు, సూచనల సేకరణ.. వ్యక్తిగతంగా,
- పోస్టు ద్వారా సమాచార స్వీకరణ
- ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని సీఎండీలు, ఆఫీసర్లకు నోటీసులు
- వంద రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు
హైదరాబాద్, వెలుగు : చత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి పది రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించడానికి విద్యుత్ రంగ నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు, యాదాద్రి పవర్ ప్లాంట్ లోనూ కాంట్రాక్టులను నామినేషన్‌పై కేటాయించడం, కాలం చెల్లిన టెక్నాలజీని కొనుగోలు చేసి వినియోగించడం, బొగ్గు ఉత్పత్తి జరిగే చోట కాకుండా వందల కిలోమీటర్ల దూరంగా ఉన్న దామరచెర్లలో చేపట్టడం వంటి అంశాలపై విచారణ చేపడుతున్నది. ఈ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తులు, విద్యుత్ రంగ నిపుణులు, సంస్థల నుంచి సూచనలు సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. అలాంటి వారు బీఆర్కే భవన్‌లోని ఏడో ఫ్లోర్‌లోని కమిషన్ ఆఫీసుకు స్వయంగా కానీ, పోస్టు ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పంపించాలని ప్రకటించింది. మౌఖికంగా కూడా తెలిపే అవకాశాన్ని విచారణ కమిషన్ కల్పించింది.
చత్తీస్‌గఢ్ ఒప్పందం ఇదే..
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నాటి బీఆర్ఎస్ సర్కారు చత్తీస్‌గఢ్ తో కరెంటు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాంటి ఓపెన్ టెండర్లు లేకుండానే రెండు రాష్ట్రాల మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది. యూనిట్ కు రూ.3.90కే కరెంటు సరఫరా అవుతుందని చెప్పినా.. కేవలం పవర్ జనరేషన్ ప్లాంట్ దగ్గరే రూ.3.90 రేటు అంటూ ఒప్పందంలో మెలిక పెట్టారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్, ఫ్యుయల్ ఖర్చులు అన్నీ కలిపి అదనంగా రూ1.50 వరకు చార్జ్ చేసి ఒక యూనిట్ కరెంటును రూ.5.50కు కొన్నట్టు విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే ఓపెన్ టెండర్లు పిలిచి ఉంటే మన రాష్ట్రం సరిహద్దు వరకు వచ్చి మరీ రూ.4 కే యూనిట్కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండేదని అంటున్నారు. ట్రాన్స్ మిషన్ కోసం నేషనల్ కారిడార్ కిరాయి తీసుకోవడంతో సరఫరా పూర్తి స్థాయిలో రాకపోయినా లైన్‌కు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఏరోజుకు ఆ రోజు డిమాండ్ ను బట్టి యూనిట్‌కు రూ.6, రూ.7, రూ.10, రూ.20 వరకు చెల్లించి కరెంటు కొనుగోలు చేశారు.
ముందే చెప్పినా వినలే..
చత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏండ్ల అగ్రిమెంట్ టైమ్‌లో రూ.12 వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లోనే విద్యుత్ రంగ నిపుణుడు రఘు ఈఆర్సీకి వివరించారు. కానీ, చత్తీస్ గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని నాటి బీఆర్ఎస్ సర్కారు ఈఆర్సీని కోరింది. అయితే గతేడాది రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి ఇచ్చిన రిపోర్టులో రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతున్నదని అంగీకరించడం గమనార్హం.
కరెంటు ఒప్పందం జరిగిందిలా..
చత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ పవర్ ప్లాంట్‌నుంచి 12 ఏండ్లపాటు కరెంటు కొనుగోలుకు తెలంగాణ డిస్కంలు, చత్తీస్‌గఢ్ కు చెందిన సీఎస్పీడీసీఎల్ మధ్య 2015 సెప్టెంబర్ 22న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగింది. ఓపెన్ టెండర్లకు బదులుగా తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంల సమక్షంలో 2014 నవంబర్ 3న జరిగిన మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎంవోయూ) ఆధారంగా ఈ పీపీఏ చేసుకున్నారు. చత్తీస్ గఢ్ విద్యుత్ తో జరగనున్న నష్టంపై అప్పటి ఎనర్జీ సెక్రటరీ అర్వింద్‌కుమార్ టీఎస్ ఈఆర్సీకి 2016 డిసెంబర్లో లెటర్ రాశారు. దీంతో ఆగ్రహించిన గత బీఆర్ఎస్ సర్కారు ఆయనను ట్రాన్స్ఫర్ చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పంపింది. ఆ తర్వాత చిన్ని చిన్న మార్పులతో టీఎస్ ఈఆర్సీ 2017 మార్చి 31న అమలుచేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
కరెంటు సరఫరా జరిగిందిలా
ఒప్పందం ప్రకారం చత్తీస్‌గఢ్ మన రాష్ట్రానికి 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలి. వెంటనే సప్లై చేస్తామని చెపినప్పటికీ.. మార్వా ప్లాంటులో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి 2016 జులైలో స్టార్ట్ అయ్యింది. ఈ ప్లాంటులో కరెంటు ఉత్పత్తి 2017–-18లో 72%, 2018-–19లో 64%, 2019–20లో 27%, 2020-–21లో 39%, 2021-–22లో కేవలం 1,631 మిలియన్ యూనిట్లు (19%) మాత్రమే జరిగింది. ఆ మేరకే సరఫరా చేశారు. 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా సరఫరా నిలిచిపోయింది.
డిస్కంలకు భారీగా నష్టం
చత్తీస్గఢ్నుంచి విద్యుత్ సరఫరా కోసం నాటి బీఆర్ఎస్ సర్కారు నేషనల్ పవర్ కారిడార్‌ను కిరాయికి తీసుకున్నది. 1000 మెగావాట్ల కారిడార్ ను 12 ఏండ్ల కోసం డిస్కంలు బుక్ చేసుకున్నాయి. చత్తీస్ గఢ్ నుంచి కరెంట్ వచ్చినా.. రాకపోయినా పీజీసీఎల్ కు ట్రాన్స్మిషన్ చార్జీలు(ఏటా రూ.400 కోట్లకు పైగా) చెల్లించాల్సిందే. దీని వల్ల భారీగా నష్టం జరిగింది. లైన్ రవాణా కిరాయిని అదనంగా రూ.638.50 కోట్లు డిస్కంలు చెల్లించాల్సి వచ్చింది. అలాగే మార్వా ప్లాంటుకు అదనంగా ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి ఉండగా.. దీనిపై వివాదం కొనసాగుతున్నది. ఇలా అన్నీ కలిపి రూ.వెయ్యి కోట్లకు పైగా అనవసర ఆర్థికభారం పడింది.
కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్ నుంచి కాలం చెల్లిన 270 మెగావాట్ ల బాయిలర్లను కొనుగోలు చేసింది. ఇలా నాలుగు బాయిలర్లకు 1080 మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. గ్లోబల్ టెండర్లకు పోకుండా ఇండియా బుల్స్ అనే ప్రవైటు కంపెనీ అర్డర్ పెట్టి తీసుకోకుండా ఉన్న కాలం చెల్లిన టెక్నాలజీని నామినేషన్‌గా బీహెచ్ఈఎల్ నుంచి తీసుకున్నది. అలాగే నిర్మాణం కూడా ఆలస్యం అయింది. దీంతో జెన్కోకు భారీ నష్టం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
యాదాద్రి పవర్ ప్లాంట్
యాదాద్రి ప్లాంట్ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు నష్టం కలిగించేలా ఉన్నాయని, రూ.వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నది. దామరచెర్లలో 4,000 మెగావాట్ల కెపాసిటీ తో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్.. బొగ్గునిల్వలు కేటాయించిన మణుగూరుకు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో బొగ్గు రవాణాకు అధిక ఖర్చవుతోంది. అలాగే ఈ ప్లాంట్ నిర్మాణంలో సివిల్ వర్క్స్ నామినేషన్ పై బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియరీ కమిషన్ పై మూడు అంశాలపై విచారణ చేపట్టింది.
వంద రోజుల్లో రిపోర్టు
జ్యుడీషియల్ కమిషన్.. బీఆర్ఎస్ సర్కారు హయాంలో విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్లతో పాటు అప్పటి ఇంధనశాఖ కార్యదర్శులు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చి వారి వివరణలు తీసుకుంటున్నది. తాజాగా నిపుణుల నుంచి సూచనలు, సలహాలను సేకరించేందుకు బహిరంగ ప్రకటన జారీ చేసింది. వీటన్నింటిని క్రోడీకరించి వంద రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనుంది.