తెలుగులో శర్వానంద్ ‘జాను’ సినిమాలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన గౌరీ జి.కిషన్ గుర్తుండే ఉంటుంది. 26 ఏళ్ల ఈ సినీ నటికి తమిళనాడులో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన తాజా సినిమా అబిన్ హరికరణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘Others’. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆమె ఆహార్యం గురించి ఒక జర్నలిస్ట్ అభ్యంతరకర ప్రశ్న అడిగాడు. ‘మీ బరువు ఎంత ఉంటుంది?’ అని ఆమెను సదరు జర్నలిస్ట్ అడిగాడు. ఈ ప్రశ్న అడగడంపై గౌరీ మండిపడ్డారు. తన బరువు తెలుసుకుని మీరేం చేస్తారని ఆ జర్నలిస్ట్ను నిలదీశారు. అయితే.. తాను అడిగిన ప్రశ్నలో తప్పేం లేదని.. చాలా మంది స్టార్ హీరోయిన్లే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారని ఆ జర్నలిస్ట్ తన ప్రశ్నను సమర్థించుకున్నాడు.
ఒక్కో మహిళకు ఒక్కో రకమైన శరీరాకృతి ఉంటుందని.. ఈ సినిమాకు తన బరువు వల్ల ఎలాంటి నష్టం లేదని గౌరీ కిషన్ ఘాటుగా స్పందించింది. అయితే.. గౌరీకి మద్దతుగా సినిమా యూనిట్లో ఏ ఒక్కరూ ఆ జర్నలిస్ట్కు కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన నటన గురించి, ప్రతిభ గురించి.. పాత్రల గురించి అడగడం మానేసి ఇవేం ప్రశ్నలని గౌరీ కిషన్ సదరు రిపోర్టర్పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన తర్వాత.. గౌరీ కిషన్కు సోషల్ మీడియా నుంచి, సెలబ్రెటీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమైంది. ఆమె సరైన రీతిలో సమాధానం ఇచ్చిందని నెటిజన్లు, సెలబ్రెటీలు ప్రశంసించారు.
#Watch | உடல் எடையை பற்றி விமர்சித்து கேள்வி எழுப்பிய யூடியூபர்..
— Sun News (@sunnewstamil) November 6, 2025
- கொந்தளித்த நடிகை கெளரி கிஷன்#SunNews | #ActressGowriKishan | #MoviePressMeet pic.twitter.com/HzI7B8UkZZ
సినీ నటులను ఏదైనా అడగొచ్చనే విధంగా కొందరు జర్నలిస్టులు ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం సమర్థనీయం కాదని సెలబ్రెటీలు ముక్త కంఠంతో గౌరీ కిషన్కు సపోర్ట్ చేశారు. అయితే.. అతను మీడియా జర్నలిస్ట్ కాదని, ఒక యూట్యూబర్ అని వెల్లడైంది. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలని సెలబ్రెటీలు, నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. ఆ యూట్యూబర్ మాత్రం తాను అడిగిన ప్రశ్నలో తప్పేం లేదని, తాను క్షమాపణ చెప్పేది లేదని తేల్చి చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది. సినీ గాయని చిన్మయి కూడా ఈ వివాదంపై స్పందించింది. ఆ యూట్యూబర్ ప్రవర్తనపై, ప్రశ్నలపై తీవ్రంగా మండిపడింది. తనకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ గౌరీ కిషన్ ఒక నోట్ విడుదల చేసింది.
— Gouri G Kishan (@Gourayy) November 8, 2025
