బెంగళూరు టెక్కీల్లో ఆందోళన.. సొంత ఇల్లు కొనాలంటేనే భయపడిపోతున్నారు!

బెంగళూరు టెక్కీల్లో ఆందోళన.. సొంత ఇల్లు కొనాలంటేనే భయపడిపోతున్నారు!

ఐటీ ఉద్యోగం అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది ముందుగా బెంగళూరు. చాలా ఏళ్లుగా తెలుగు యువత ఇండియన్ సిలికాన్ వ్యాలీలో జాబ్స్ చేస్తున్నారు. చాలా మంది అక్కడే స్థిరపడేందుకు ఇళ్లు కూడా కొనుక్కున్నారు. కానీ టెక్కీల కలలు ఒక్కసారిగా పేకమేడల్లా ప్రస్తుతం కూలిపోతున్నాయి. దీనికి కారణం సునామీలా ముంచుకొస్తున్న లేఆఫ్స్. ప్రస్తుతం జాబ్స్ పోగొట్టుకున్న వారికి బయట కొత్త ఉద్యోగాలు దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కమ్ముకొస్తున్న ఏఐ భయాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. 

ప్రస్తుతం వైట్ కాలర్ జాబ్స్ టెక్ రంగంలో తగ్గుతుండటం.. ఉన్న ఉద్యోగులకూ జాబ్ సెక్యూరిటీ లేకపోవటం, ఏఐతో పెరుగుతున్న లేఆఫ్స్ కారణంగా బెంగళూరులో టెక్కీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో చాలా మంది కొత్తగా ఇల్లు కొనాలి అనే ఆలోచనకు దూరంగా జరుగుతున్నారు. ప్రాపర్టీ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ వాటి జోలికి కూడా వెళ్లటం లేదని రెడిట్ యూజర్ చెప్పాడు. ఇప్పటికే ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తున్నవారు జాబ్ పోతే పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు. 

అసలు ఎందుకు ఇల్లు కొనాలి అనే ఆలోచనలోకి చాలా మంది టెక్కీల ఫ్యామిలీలు వచ్చేశాయి. కోటి లోన్ తీసుకుని దానికి దాదాపు నెలకు రూ.లక్ష 50వేలు ఈఎంఐ చెల్లించాలి. అయితే ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఇంత రిస్క్ తీసుకుని ఇల్లు కొనాల్సిన పనేముందని అంటున్నారు. జాబ్ పోయాక నెలకు లక్షన్నర అరేంజ్ చేసుకుని ఈఎంఐలు కట్టడం అంత ఈజీ కాదని అంటున్నారు. 

ఈ పరిస్థితులతో చాలా మంది కొత్త టెక్ ఉద్యోగులు ఇల్లు కొని 15-20 ఏళ్లు ఈఎంఐలు చెల్లించే బాధ్యతలో ఇరుక్కోవటం కంటే అద్దెకు ఉండటం మంచిదని భావిస్తున్నారు. లోన్ల జంజాటంలో ఇరుక్కుని సమస్యల సుడిగుండంలోకి అడుగుపెట్టడం ఇప్పుడు సరైన నిర్ణయం కాదని వారు అంటున్నారు. ప్రస్తుతం రియల్టీ కంపెనీల నుంచి వస్తున్న కోల్డ్ కాల్స్ కూడా ఏఐ బాట్స్ నుంచే వస్తున్నాయని.. ఇది ఏఐ విస్తరణ ఏస్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోందని టెక్కీలు అంటున్నారు. 

మారిన ఈ పరిస్థితులతో బిల్డర్లు కూడా సంపన్న వర్గాలు, టెక్ రంగంలో స్థిరబడిన సీనియర్లను టార్గెట్ చేస్తూ ప్రాపర్టీలు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్టీ రేట్లు 40 శాతం పతనం అయినా హడావిడిగా కొనే స్థాయిలు టెక్కీలు అస్సలు లేరని తెలుస్తోంది. రేట్ల కంటే దానికి పేమెంట్స్ చేయగలమా లేదా అనే దానిపైనే ప్రజలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత రియల్టీ బూమ్ బెంగళూరులో భారీగానే పెరిగినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఏఐ కారణంగా పూర్తిగా జీవితాలను తలకిందులు చేస్తున్నాయని టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.