Tax News: ఆదాయపన్ను రిటర్న్స్ లో పొరపాట్ల సవరణలను వేగవంతం చేయడం, పన్ను రీఫండ్‌లను త్వరగా అందించడం లక్ష్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసంఅక్టోబర్ 27, 2025న విడుదల చేసిన నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరు సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ కమిషనర్‌కు, అధికృత అధికారులకు పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లో తక్షణమే సవరణలు చేసే అధికారాన్ని మంజూరు చేసింది.
ఇప్పటివరకు ఆదాయపన్ను రిటర్నుల్లో పొరపాట్లు, తప్పుడు ట్యాక్స్ క్రెడిట్‌లు, ఆలస్యం అయిన రీఫండ్‌లు వంటి సమస్యలను పరిష్కరించడానికి పన్ను చెల్లింపుదారులు వివిధ అధికారులను సంప్రదించాల్సివచ్చేది. కానీ తాజా వ్యవస్థతో CPC నేరుగా అంకెలలోని పొరపాట్లు, లెక్కల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేయటానికి అధికారం పొందింది. దీనివల్ల అథెంటికేషన్ ప్రక్రియలోని ఆలస్యాలు తగ్గి, పన్ను చెల్లింపుదారులకు సేవలు వేగంగా అందుతాయని అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానం ప్రకారం CPC కమిషనర్‌కు, వివిధ అసెసింగ్ అధికారులతో పాటు సమాంతర అధికారాలు లభిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా రికార్డుల్లో ఉన్న స్పష్టమైన పొరపాట్లు లేదా సాంకేతిక లోపాలను సమయానుకూలంగా సరిచేయవచ్చు. అదనంగా చెల్లించాల్సిన పన్ను నోటీసులు (Section 156) జారీ చేసే అధికారాన్ని కూడా వీరికి ఇచ్చారు. దీని ద్వారా పన్ను చెల్లింపుదారుల ఖాతాలో ముందస్తుగా చెల్లించిన ట్యాక్స్ క్రెడిట్‌లు, సడలింపులు, వడ్డీ లెక్కల్లో తేడాల వంటి అంశాలు సరిచేయడం సులభమవుతుంది. పన్ను విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ వెల్లడించింది.
ఇది పన్ను చెల్లింపుదారులకు వేగంగా రీఫండ్‌లు, ఖచ్చితమైన వడ్డీ లెక్కలు పొందే అవకాశం కల్పిస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, అడ్వాన్స్ ట్యాక్స్ లేదా ఇతర తేడాల వల్ల ఆలస్యం జరిగిన రీఫండ్‌లకు తక్షణ పరిష్కారం లభించనుంది. అలాగే సీనియర్ అధికారులు తమ పవర్స్ కింది స్థాయి సిబ్బందికి బదిలీ చేసే సౌకర్యం కూడా కల్పించినందున, దేశవ్యాప్తంగా రీజినల్ స్థాయిలో కార్యకలాపాలు మరింత సౌలభ్యంగా సాగుతాయని అధికారులు అంటున్నారు.
