వంట సామగ్రి ఇలాగేనా ?.. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం

 వంట సామగ్రి ఇలాగేనా ?.. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం
  • షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని ఆదేశం 

వర్ధన్నపేట, వెలుగు: పురుగులు ఉన్న బియ్యం, కుళ్లిన కూరగాయలు, కాలం చెల్లిన రవ్వ వంట సామగ్రి ఇలాగేనా ఉండేది అంటూ వరంగల్​ కలెక్టర్​ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె వర్ధన్నపేట ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందజేస్తున్న భోజనాల వివరాలపై ఆరా తీస్తూనే వంట శాలను పరిశీలించారు. వంట సామగ్రి సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని డీటీడీవోను ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్నారా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు స్కూల్​లో నిర్వహించిన వందేమాతర గేయం ఆలాపన కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొన్నారు.

 అనంతరం ఆమె వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రిని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. సౌకర్యాలపై రోగులతో మాట్లాడారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వీడీసీ శ్రీనివాస్​పై వేటు వేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. దవాఖానలో ఒకేసారి 20 మంది లీవ్ తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అడ్మిన్ లో పనిచేసే శ్రీనివాస్ లీవ్ పెట్టకుండా డ్యూటీలో ఉండి హాస్పటల్ రాకపోవడంతో వెంటనే టెర్మినేట్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత ఇల్లంద మార్కెట్​యార్డును సందర్శించి కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలకు మండల కేంద్రంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్​ పరిశీలించి, నష్టాన్ని నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. 

భూములు కోల్పోయిన డబ్బులు చెల్లిస్తాం 

కాశీబుగ్గ : వరంగల్​ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఏర్పాటు చేస్తున్న 163జీ నేషనల్​ గ్రీన్​ ఫీల్డ్​ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని కలెక్టర్​సత్య శారద అన్నారు. కలెక్టరేట్ లో నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన గీసుకొండ, ఉకల్, బోట్టు చింతలపల్లి గ్రామాల రైతులతో మాట్లాడి భూ నిర్వాసితులతో ఆర్పిట్రేషన్​ నిర్వహించారు. రైతులతో మాట్లాడి నష్ట పరిహారం త్వరగా అందించేందుకు సంబంధిత ఆఫీసర్లను ఆదేశించాడం జరిగిందని అన్నారు.