పదేండ్లుగా విభజన సమస్యలపై పీటముడి

పదేండ్లుగా  విభజన సమస్యలపై పీటముడి
  • గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు
  • ఇప్పుడు సీఎం రేవంత్​ ఆదేశాలతో ఫైల్స్​ దులుపుతున్న ఆఫీసర్లు
  • ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలో 
  • సమస్యల్లేని మిగతావన్నీ వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం  
  • కార్పొరేషన్ల ఆస్తులు, ఉద్యోగుల పంపకంపైనా గందరగోళమే
  • జూన్​ 4 తర్వాతే ఈ సమస్యల పరిష్కారానికి మార్గం  
  • కేంద్రంలో, ఏపీలో  ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉండడంతో అప్పటిదాకా ఆగాల్సిందే

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావొస్తున్నా.. గత బీఆర్ఎస్​ సర్కారు​అనుసరించిన తీరుతో విభజన సమస్యల పీటముడి వీడడం లేదు. సదరన్​ మీటింగ్స్​కు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్​ డుమ్మా కొట్టడంతో  అనేక ఇష్యూస్​ పెండింగ్​లో పడ్డాయి. ఇక  కార్పొరేషన్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కొన్నేండ్లుగా ఎలాంటి కదలిక లేకుండా మూలకు పడిన విభజన చట్టం ఫైల్స్ ను ​సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలతో ఆఫీసర్లు రెడీ చేసే పనిలో పడ్డారు. షెడ్యూల్​ 9, 10లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపిణీ పూర్తి చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్​ ప్లాన్​ రెడీ చేస్తోంది. కోర్టుల్లో ఏపీ వేసిన కేసులపైనా వివరాలు తీస్తున్నారు. విభజన చట్టం ప్రకారం పదేండ్లలోనే విభజనకు సంబంధించిన ఇష్యూలను క్లియర్​ చేసుకోవాల్సి ఉన్నది. 

ఇప్పుడు ఇంకో 15 రోజుల టైం ఉండటంతో క్లియర్​కాని సమస్యల కోసం విభజన చట్టాన్ని మళ్లీ సవరించాల్సిన అవసరం ఏర్పడొచ్చని అధికారులు అంటున్నారు. ఇక ఏపీకి, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్​ గడువు ఈ ఏడాది జూన్​ 2తో ముగియనుంది. దీంతో తెలంగాణ సర్కారు​కే రాజధాని పరిధిలో ఉన్న ప్రభుత్వ హక్కులు వర్తించనున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేని భవనాలను తెలంగాణ సర్కారు వెంటనే ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఇంకా విభజన పూర్తి కాని వాటిపై కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు జరపనున్నారు. అయితే, ఇప్పుడు పార్లమెంట్​ ఎన్నికలు జరుగుతుండటం, ఏపీలోనూ ఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది జూన్​ 4 తర్వాతే తేలనుండటంతో పీటముడి ఉన్న సమస్యలపై చర్చించేందుకు కొద్దిరోజులు ఆగాల్సిందేనని సెక్రటేరియేట్​లో ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు తెలిపారు. 

9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే

గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంతోనే ఇప్పటివరకూ 9,10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలేదు. సింగరేణి కాలరీస్ విభజనతో పాటు దానికి అనుబంధంగా ఏపీలో ఉన్న హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (అప్మెల్), చట్టంలో లేకపోయినా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కొన్ని సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదలైన నిధులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం, ఖర్చు లెక్క తేల్చడం,  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలు, చెల్లింపులు, వడ్డీ తదితరాలపై లెక్క సెట్​ కావడం లేదు.  విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్​లోని మొత్తం 91 సంస్థల్లో  షీలా భిడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను మాత్రమే పంచింది.  రాష్ట్రం ఏకీభవించని మిగతా సంస్థల విభజనపై  షీలా భిడే కమిటీ రూపొందించిన సిఫార్సులను తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. ఏపీ కూడా ఆ సిఫార్సులను అంగీకరించలేదు. అయితే ఈ  సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉన్నాయి.  విభజన చట్టంలోని ఏ షెడ్యూల్​లోనూ లేకుండా మరో 32 సంస్థలున్నాయి. 

వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందికరంగా మారింది.  తొమ్మిదో షెడ్యూల్​లో ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయింది. డెక్కన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి  తీసుకుంది. ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి, స్టే ఆర్డర్ తెచ్చుకున్నది.  ఏపీ స్టేట్ ఫైనాన్స్​ కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్‌‌‌‌కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దానిని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు కోర్టులో స్టే తీసుకుంది. ఇప్పటికీ స్టేట్​ఫైనాన్స్​ కార్పొరేషన్​ విభజన జరగకపోవడంతో.. అక్కడ మొత్తం ఏపీ అధికారుల పెత్తనమే నడుస్తోంది. ఇక పదో షెడ్యూల్​లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాల్సి ఉండగా.. దీనిపైనా రిట్​ పిటిషన్​ దాఖలైంది.  తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్​ ఓపెన్​ వర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్​యూ ఫైన్​ ఆర్ట్స్​ యూనివర్సిటీ విభజన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.    

రూ.2 వేల కోట్ల డిపాజిట్లపై స్పష్టత కరువు

ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన పవర్​ యుటిలిటీస్​ రూ.12,111 కోట్లు అని రాష్ట్రం అంటోంది. టీఎస్ జెన్​కో ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు రూ.3,422 కోట్లని చెప్తోంది.  ఏపీ నుంచి  సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌‌‌‌ల విషయంలో రూ.495 కోట్లు ఏడేండ్లుగా పెండింగ్​లో ఉన్నట్టు  తెలంగాణ రాష్ట్రం అంటోంది.  హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ఉమ్మడి సంస్థలపై రూ.315 కోట్ల వరకు ఖర్చు చేసిన సొమ్ముపై ఏపీ చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి.  నిర్మాణంలో ఉన్న భవనాల వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, ఇంకో రూ.208 కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ పేర్కొంటోంది. అయితే అంత మొత్తం కాదని.. కొన్నింటికే ఇవ్వాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్, పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ విభజన పూర్తి స్థాయిలో కాలేదు. ఫిల్మ్​ డెవలప్ మెంట్, టీఎస్ఎంఎస్ఐడీసీ, మినరల్​ డెవలప్​మెంట్​ వంటి  ఆస్తుల పంపకాలు, షేర్లపై గందరగోళం నెలకొంది.  కొన్ని సంస్థల్లో జాయింట్​అకౌంట్ల కింద ఫిక్స్​డ్ డిపాజిట్లు దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు.

ఇప్పటికీ ఏపీ అధీనంలోనే పలు భవనాలు

అప్పటి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్​ ఈఎస్ఎల్​ నరసింహన్​.. అప్పుడున్న ప్రభుత్వాలతో మాట్లాడి ఏపీ ఆధీనంలో ఉన్న కొన్ని భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆదర్శ్ నగర్‌‌‌‌లో ఉన్న హెర్మిటేజ్ భవనం, లక్డీకాపూల్‌‌‌‌లో ఉన్న సీఐడీ భవనం, లేక్ వ్యూ గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లు ఏపీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. వివిధ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బిల్డింగ్స్​లో స్పేస్​ కు సంబంధించి ఏపీ అధికారులు తాళాలు వేసుకుని పోయారు. ఇప్పుడు ఇవన్నీ జూన్​2 తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి.  ఇందులోనూ విభజన పూర్తిగా జరిగి సమస్యలు లేని వాటినే రాష్ట్ర అధికారులు తీసుకోనున్నారు. మిగతా వాటిపై ఏపీ, కేంద్ర హోం శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఏపీ అధీనంలో ఉన్న వాటన్నింటిని తీసుకుంటే.. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలకు మస్త్​ స్పేస్​ ఉంటుందని.. ప్రైవేట్​ బిల్డింగ్స్​లో ఉన్న వాటన్నింటినీ  షిఫ్ట్​ చేసుకోవడంతో పాటు మరికొన్నింటిని అద్దెకు కూడా ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

పదేండ్లు కావొస్తున్నా ఇంకా అజమాయిషీ

స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్, టీఎస్ఎం ఐడీసీ, టూరిజం, తెలుగు అకాడమీ, ఇండస్ట్రియల్​​ డెవలప్​మెంట్​కార్పొరేషన్లలో ఇంకా ఆంధ్రా అధికారుల పెత్తనమే కొనసాగుతున్నది. వాటిపైన వచ్చే ఆదాయంపైన కూడా వారి భాగాన్ని తీసుకుంటున్నారు. పదేండ్లు కావొస్తున్నా ఇంకా అజమాయిషీ చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం సంతోషం. విభజన తర్వాత ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్త పోస్టులు క్రియేట్​ చేయలేదు. వాటిని క్రియేట్​ చేసి ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 

- టి. జీవన్​, జనరల్ ​సెక్రటరీ, 
తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల సమాఖ్య