చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు ఆడబిడ్డలను కోల్పోయిన కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు. కను మూసినా తెరిచినా వారి జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయినా.. గుండెల్లో నుంచి వచ్చే వేదనతో ఆ ఇల్లు ఇప్పటికీ కన్నీటి సంద్రంలోనే మునిగిపోయింది. గురువారం (నవంబర్ 06) పరిహారం అందుకుంటూ ఆ తండ్రి రోధించిన తీరు అక్కడున్న గ్రామస్తులను, అధికారులను భావోద్వేగానికి గురిచేసింది.
చనిపోయిన ముగ్గురు అమ్మాయిల్లో.. ఒకమ్మాయి ఉద్యోగం చేస్తూ నెలనెలా ఇంటికి జీతం పంపిస్తూ ఉండేది. మిగతా ఇద్దరు చదువుతున్నారు. ప్రతినెలా తన కూతురు జీతం పంపే సమయానికే.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందడంతో ఆ తండ్రి ఎల్లయ్య గౌడ్ ఆవేదనను మాటల్లో చెప్పలేం. అధికారులు ఇచ్చిన చెక్కును తీసుకుంటూ.. నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురికి.. ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించింది. గురువారం (నవంబర్ 06) ఉదయం ఎల్లయ్య గౌడ్ ఇంటికి వెళ్లిన అధికారులు.. పరిహారాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా నా కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కలిసి నాకు పంపించిన జీతమా ఇది అంటూ తీవ్రంగా గుండెలు కరిగేలా రోదించాడు తండ్రి. ఎల్లయ్య గౌడ్ హృదయ విదారక పరిస్థితి చూసి అధికారులు, గ్రామస్తులు కలత చెందారు. ఈ దయనీయ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదని నిట్టూర్చారు.
తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏండ్ల కింద తాండూరు టౌన్‌కు వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు ఉన్నారు. ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. ఇటీవల పెద్ద కూతురు అనూష పెండ్లిని ఘనంగా చేశాడు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోఠి విమెన్స్కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ ఫస్టియర్, కొడుకు తాండూరు టౌన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 15న జరిగిన అక్క అనూష పెండ్లికి తనూష, సాయిప్రియ, నందిని వచ్చారు. సోమవారం పరీక్షలు ఉండడంతో ముగ్గురూ తాండూరు బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెక్కారు.
అంతలోనే మృత్యువు కబళించి ఆ ముగ్గురినీ తీసుకెళ్లింది. చేవెళ్ల దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 19 మందిలో ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు యవతులు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదనకు గురిచేసిన విషయం తెలిసిందే.
సోమవారం (నవంబర్ 03) ఉదయం చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్, డ్రైవర్ వెనక కూర్చున్న వాళ్లలో చాలా మంది చనిపోయారు. మొత్తం 19 మంది చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
నిర్మాణ పనుల కోసం పటాన్ చెరు నుంచి వికారాబాద్ కు కంకర లోడ్ తో టిప్పర్ వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్లి బస్సును ఢీ కొట్టింది టిప్పర్. తాండూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు.
