న్యాయవ్యవస్థలోనూ అవినీతి ఉంది .. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యాయవ్యవస్థలోనూ అవినీతి ఉంది .. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తమిళ చిత్రం కరుప్పు నిషేధించాలంటూ వేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. న్యాయవ్యవస్థను చెడుగా చిత్రీకరిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

న్యాయమూర్తులను పవిత్ర గోవులుగా భావించకూడదు.. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనేది పచ్చి నిజం అంటూ జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.  గతంలోనూ, ఇప్పుడు కూడా అవినీతిపరులైన న్యాయమూర్తులు ఉన్నారని.. తమకు కూడా అటువంటి ఉదంతాలు తారసపడ్డాయని న్యాయస్థానం అంగీకరించింది. అయితే అలాంటి వారిని మద్రాస్ హైకోర్టు ఫుల్ కోర్ట్ క్రమం తప్పకుండా పదవి నుండి తొలగిస్తూ, నిరంతర నిఘా ఉంచుతోందని స్పష్టం చేసింది. అంతేకాదు, న్యాయవాదుల సంఘంలోని కొందరి సహకారం లేకుండా ఈ అవినీతి జరగదని కోర్టు అభిప్రాయపడింది.

కళాత్మక స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తూ.. సామాన్య ప్రజల నిర్మొహమాటమైన విమర్శలను సైతం గౌరవప్రదంగా ఎదుర్కొనేలా న్యాయవ్యవస్థ ఉండాలని ధర్మాసనం తెలిపింది. సినిమాలో ఒక కల్పిత కోర్టులోని పాత్రలను అవినీతిపరులుగా చూపించినంత మాత్రాన, అది మొత్తం వ్యవస్థను కించపరిచినట్లు కాదని స్పష్టం చేసింది.

తమిళ సినిమాల్లో విషయాలను కాస్త నాటకీయంగా, అతిశయోక్తిగా చూపించడం సర్వసాధారణమని.. అది ఒక కళాకారుడి భావప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు తమ అభిప్రాయాలను మాటలు, రాతలు లేదా చిత్రాల ద్వారా వ్యక్తపరిచే హక్కు ఉందని గుర్తు చేసింది.చివరగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే ఈ సినిమాకు అనుమతి ఇచ్చిందని.. కాబట్టి సృజనాత్మకతను అణచివేసేలా సినిమాను నిషేధించడానికి లేదా నియంత్రించడానికి ఎలాంటి ఆధారం లేదని చెబుతూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.