ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి బ్రేక్ ఫాస్ట్..దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీ.. ఫుల్ మెనూ డీటెయిల్స్

ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి బ్రేక్ ఫాస్ట్..దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీ.. ఫుల్ మెనూ డీటెయిల్స్

ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివే పేద విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత  కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో సరికొత్తగా  బ్రేక్ ఫాస్ట్ స్కీంను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దేశంలోనే ప్రభుత్వ కాలేజీల్లో ఇటు బ్రేక్ ఫాస్ట్, అటు మిడ్ డే మీల్స్ (మధ్యాహ్న భోజనం) రెండూ అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

ఈ పథకం కింద విద్యార్థులకు నోరూరించే మెనూని సిద్ధం చేసింది ప్రభుత్వం. రోజూ మార్చి మార్చి వేడివేడి దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీ, బొండాలతో పాటు... నంజుకోవడానికి రుచికరమైన చట్నీ, సాంబార్, మిక్స్ డ్ వెజిటేబుల్ కుర్మాలను అందించనున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ , మిడ్ డే మీల్స్ పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా అక్షరాలా రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌ను ఖర్చు చేయబోతోంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 92 వేల మంది ఇంటర్ విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.

ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే పిల్లల వ‌య‌స్సు 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య ఉంటుంది. ఇది వారు శారీర‌కంగా, మాన‌సికంగా ఎదిగే అత్యంత కీలకమైన కౌమార ద‌శ‌. జాతీయ పోష‌కాహార సంస్థ (NIN) సిఫార్సుల ప్రకారం ఈ వ‌య‌స్సులో ఉన్నవారికి రోజుకు 1029 కిలోకేల‌రీల శక్తీ అలాగే 30 నుంచి 32 గ్రాముల ప్రోటీన్ ఖచ్చితంగా అవ‌స‌రం.ఎన్‌ఐఎన్ (NIN) సిఫార్సులకు అనుగుణంగా... విద్యార్థులకు సరైన మోతాదులో పౌష్టికాహారం అందించి, వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ బృహత్తర పథకానికి రూపకల్పన చేశారు.