జూబ్లీహిల్స్ , వెలుగు: అమీర్‌పేట్ మైత్రివనం జంక్షన్ వద్ద గురువారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా వీఐపీల రాకపోకలు, బహిరంగ సభ ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు. ఈ ఆంక్షలు మే 27 రాత్రి 10 గంటల నుంచి మే 28 రాత్రి 11 గంటల వరకు అమలులో ఉంటాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు..
- అమీర్‌పేట్, సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లేవారు సారథి స్టూడియో – యూసుఫ్‌గూడ బస్తీ మార్గాన్ని నివారించి, వెంగళరావు నగర్ కమాన్, కల్యాణ్ నగర్, కృష్ణకాంత్ పార్క్ మీదుగా వెళ్లాలి.
- 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, రహ్మత్ నగర్, యూసుఫ్‌గూడ బస్తీ నుంచి వచ్చే వాహనాలకు మైత్రివనం వైపు అనుమతి ఉండదు. వీరంతా కృష్ణకాంత్ పార్క్, కల్యాణ్ నగర్, వెంగళరావు నగర్ మార్గాలను ఉపయోగించాలి.
- యూసుఫ్‌గూడ బస్తీ– అల్ సబా హోటల్ మధ్య ఉన్న రహదారుల నుంచి వచ్చే వాహనాలను కూడా మైత్రివనం వైపు అనుమతించకుండా, ఎస్ఆర్.నగర్, అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు.
ఏర్పాట్ల పరిశీలన..
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేశ్ కలిసి బుధవారం
పరిశీలించారు.
