రెండే రెండు గొర్రెల కాపరి ఉద్యోగాలు. కానీ క్యూలో నిల్చున్నది మాత్రం పెద్ద చదువులు పూర్తి చేసిన వైట్ కాలర్ ప్రొఫెషనల్స్. వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. చైనాలో జరిగిన ఈ విచిత్రమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. మంగోలియా సరిహద్దు ప్రాంతంలో గొర్రెలు కాయడానికి కేవలం ఇద్దరు వ్యక్తులు కావాలంటూ జువో జియావోయాంగ్ అనే ఒక ఫామ్ ఓనర్ సోషల్ మీడియాలో చిన్న యాడ్ ఇచ్చాడు. అంతే.. కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్ చైనా ట్విట్టర్ అయిన వీబోలో 5.9 కోట్ల వ్యూస్‌తో నంబర్ వన్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కేవలం రెండు పోస్టుల కోసం ఏకంగా 700 మందికి పైగా అప్లై చేశారు.
ఈ క్రేజీ డిమాండ్ వెనుక చైనా జాబ్ మార్కెట్‌లోని పరిస్థితులను బయటపెడుతోంది. కార్పొరేట్ ఆఫీసుల్లో వారానికి 6 రోజులు, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పశువుల్లా పనిచేయించుకునే '996' కల్చర్, మరోపక్క ఏఐ భయాలు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోజుకు 13 గంటలు బాత్రూమ్‌కి కూడా వెళ్లకుండా స్క్రూలు తిప్పి చేతులకు బొబ్బలు ఎక్కిన 21 ఏళ్ల కుర్రాడు జేమ్స్ గుయో దగ్గర నుండి.. షాంఘై, చాంగ్‌కింగ్ లాంటి మెగా సిటీల్లో ఆఫీస్ పాలిటిక్స్ భరించలేక విసిగిపోయిన వైట్ కాలర్ ఎంప్లాయ్స్ వరకు అందరూ ఈ గొర్రెల కాపరి ఉద్యోగానికి అప్లై చేయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనాలో ప్రస్తుతం 35 ఏళ్లు దాటితే ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. దీని కారణంగా వీరిలో సగం మంది దరఖాస్తుదారులు 1990లలో పుట్టినవారే కావడం గమనార్హం.
ఇక ఈ ఉద్యోగానికి జీతం కూడా గట్టిగానే ఆఫర్ చేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.లక్షా 10వేలకు పైమాటే. చైనా ప్రైవేట్ కంపెనీల యావరేజ్ శాలరీ సుమారు రూ.70వేల కంటే ఇది చాలా ఎక్కువ. దీనికి తోడు ఉచిత వసతి, గ్రాసరీస్ కూడా ఫ్రీ. చైనాలోని పెద్ద యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి సిటీల్లో ఈ స్థాయి జీతం వస్తున్నా.. అందులో మెజారిటీ ఇళ్ల అద్దెలకే సరిపోతోంది. అందుకే ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గొర్రెలను కాసుకుంటూ నెలకు రూ.లక్ష సంపాదించుకోవచ్చని సిటీ జనాలు ఆశపడ్డారు.
ALSO READ : జీతం సరిపోతలేదు బాస్: హైక్ కావాల్సిందేనని పట్టుబడుతున్న 81% భారతీయ ఉద్యోగులు
అయితే ఈ ఉద్యోగం అనుకున్నంత ఈజీ కాదు. వేసవిలో 4వేల 900 ఎకరాల విస్తీర్ణంలో 3వేల గొర్రెలను మేపాల్సి ఉంటుందట. శీతాకాలంలో మైనస్ 30 డిగ్రీల చలిలో వాటిని క్లీన్ చేస్తూ లోపలే ఉంచాలి. ఇదేదో టూరిజం కాదు.. ప్రాణం పోయేంత చలిని, ఏడాది పొడవునా మనుషులు కనిపించని ఒంటరితనాన్ని భరించాలని ఓనర్ జువో ముందే స్పష్టంగా చెబుతున్నారు. అందుకే ఆయన సిటీ కుర్రాళ్లను, సింగిల్స్ నమ్మకుండా.. గతంలో ఫార్మింగ్ అనుభవం ఉండి, ఒంటరితనాన్ని తట్టుకోగల 1980లలో పుట్టిన రెండు జంటలను అంటే మెుత్తం నలుగురిని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. మరో 40 జంటలను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టాడు. సిటీ లైఫ్ నరకంలా మారితే, మనుషులు గొర్రెల కాపరులుగా మారడానికైనా రెడీ అవుతారని చైనాలోని ఈ ఘటన నిరూపించింది.
