2026లో కూడా లివింగ్ కాస్ట్స్ కొండెక్కి కూర్చుంటే, ఏఐ ఎక్కడ తమ ఉద్యోగాలను ఊడబీకుతుందోననే భయం ఐటీ నుంచి ఆడిటింగ్ వరకు అందరినీ వెంటాడుతోంది. ఈ టెన్షన్ల మధ్య అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్(ACCA) సర్వే బయటపెట్టిన నిజాలు ఇప్పుడు బాస్‌ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
ఇండియాలో కేవలం 29% మంది మాత్రమే తమకు వచ్చే జీతాల విషయంలో హ్యాపీగా ఉన్నారట. మిగిలిన వాళ్లంతా పెరిగిన ఖర్చుల దెబ్బకు విలవిలలాడుతున్నారని సర్వేలో వెల్లడైంది. అందుకే వచ్చే 12 నెలల్లో ఎలాగైనా సరే శాలరీ హైక్ అడగాలని 81% మంది ఉద్యోగులు డిసైడ్ అయిపోయారని తేలింది. 2025లో ఈ సంఖ్య 67% మాత్రమే ఉండేది. అయితే ఈసారి అది గ్లోబల్ యావరేజ్ 62% ని దాటేసి మరీ దూసుకుపోతోంది. ఇంకెంతకాలం బాస్ ఈ పాత జీతాలు? అంటూ ఎంప్లాయ్స్ యుద్ధానికి రెడీ అవుతున్నారు.
జీతాల పోరులో జనరేషన్ల వారీగా చూస్తే మిల్లెనియల్స్ అస్సలు తగ్గడం లేదు. పెళ్లిళ్లు, ఈఎంఐలు, పిల్లల ఫీజుల భారం ఎక్కువైపోతుండటంతో 90% మంది ఈసారి కచ్చితంగా జీతం పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. వారి వెనకాలే 77% జెన్-జీ యూత్, 75% జెన్-ఎక్స్ ఉద్యోగులు కూడా తమకూ హైక్స్ కావాలంటూ క్యూలో నిల్చున్నారు. గ్లోబల్ లెవెల్లో 37% మంది మాత్రమే డబుల్ డిజిట్ హైక్ ఆశిస్తుంటే.. మన భారతీయులు మాత్రం తగ్గేదే లే అంటూ 68% మందికి పైగా ఉద్యోగులు కనీసం 10% కంటే ఎక్కువ జీతం పెరగాలని కోరుకుంటున్నారని తేలింది.
ALSO READ : ఆటో లవర్స్‌కు పండగే..
10% కంటే ఎక్కువ హైక్ కావాలని కోరుకునే వారిలో పెద్దన్నలు అయిన జెన్-ఎక్స్ 76% తో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత జెన్-జీ 60%, మిల్లెనియల్స్ 55% తో ఉన్నారు. కుర్రాళ్లకు చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ ముఖ్యం అయితే.. మిడ్-కెరీర్ ప్రొఫెషనల్స్ మాత్రం శాలరీతో పాటు ప్రశాంతత, కెరీర్ శాటిస్ఫాక్షన్ కూడా వెతుక్కుంటున్నారు. మొత్తానికి కంపెనీలకు ఇప్పుడు పెద్ద పరీక్షే వచ్చి పడింది. ఒకపక్క లాభాలు చూసుకోవాలి.. మరోపక్క టాలెంటెడ్ ఎంప్లాయ్స్ వదిలిపోకుండా జీతాలు పెంచాలి. ఈ యుద్ధంలో ఎవరు విన్ అవుతారనేది వేచి చూడాల్సిందే.
