ఆటో లవర్స్‌కు పండగే.. క్రేజీ ఫీచర్లు, షాకింగ్ ధరలతో టాటా టియాగో, టియాగో EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్!

ఆటో లవర్స్‌కు పండగే.. క్రేజీ ఫీచర్లు, షాకింగ్ ధరలతో టాటా టియాగో, టియాగో EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్!

కార్ల ప్రేమికులకు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను శాసిస్తున్న తన పాపులర్ మోడల్స్ టాటా టియాగో, టియాగో EVలను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ 2026 అప్‌డేటెడ్ మోడల్స్ కేవలం లుక్స్ పరంగానే కాకుండా.. టెక్నాలజీ, క్యాబిన్ డిజైన్, ఫీచర్ల పరంగా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ప్రీమియం లుక్‌తో వచ్చిన ఈ రెండు కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టడమే కాదు, అందరూ ఊహించిన దానికంటే చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేశాయి. 

లుక్స్ విషయానికి వస్తే.. కొత్త టియాగో ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా మారిపోయింది. స్లీకర్ హెడ్‌ల్యాంప్స్, లక్స్ బీమ్ ఎల్‌ఈడీ లైటింగ్, సరికొత్త బంపర్లు, వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఎలిమెంట్స్‌తో కారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. అలాగే 15-ఇంచుల సరికొత్త అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. ఇక టియాగో ఈవీలో మరింత క్లీన్ అండ్ మోడ్రన్ ఈవీ ఫోకస్డ్ డిజైన్‌ను అందించారు. ఈసారి కలర్ ఆప్షన్లలో కూడా టాటా సరికొత్త ప్రయోగం చేసింది. పెట్రోల్, సీఎన్‌జీ మోడల్స్ కోసం క్రేజీ కలర్స్ రాగా.. ఈవీ మోడల్ కోసం గ్రీన్ టీ ఇన్‌స్పైర్డ్ 'డెహ్రాడూన్ డ్యూ' అనే సరికొత్త షేడ్‌ను పరిచయం చేశారు.

ఈ కొత్త కార్లలో క్యాబిన్ లోపల జరిగిన మార్పులు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. డ్యాష్‌బోర్డ్‌ను పూర్తిగా మార్చేస్తూ గ్రాండ్ టెక్ కన్సోల్, డిజిటల్ ఐలాండ్ క్లస్టర్లను అమర్చారు. ప్రీమియం వేరియంట్లలో 10.25-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో గ్రాఫిక్స్, మెనూలను మరింత మోడ్రన్‌గా అప్‌డేట్ చేశారు. దీనికి తోడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఎక్కడా లేని విధంగా డ్యూయల్ వైర్‌లెస్ చార్జర్లు, రియర్ ఏసీ వెంట్స్, టైప్-సి చార్జింగ్ పోర్టులు, 2D/3D వ్యూస్‌తో 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా సిస్టమ్‌ను టాటా ఆఫర్ చేస్తోంది. అన్నింటికంటే క్రేజీ ఫీచర్ ఏంటంటే.. పెట్రోల్, సీఎన్‌జీ ఏఎంటీ వెర్షన్లలో ఇప్పుడు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు. ఇది ఆటో లవర్స్‌కు డ్రైవింగ్ చేయడంలో ప్యూర్ స్పోర్టీ ఫీల్‌ను ఇస్తుంది. అలాగే హై-స్ట్రెంత్ స్టీల్ వాడకం వల్ల కారు సేఫ్టీ కూడా మరింత మెరుగైంది.

ఇక మెకానికల్స్ విషయానికి వస్తే.. పెట్రోల్ మోడల్ మునుపటి 1.2-లీటర్ ఇంజిన్‌తోనే కొనసాగుతుంది. ఇది లీటరుకు దాదాపు 19 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునే వారి కోసం ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఆప్షన్ కూడా ఉంది. ఇక టియాగో ఈవీ 24kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది MIDC సర్టిఫైడ్ రేంజ్ 285 కిలోమీటర్లు ఇస్తుండగా.. నార్మల్ సిటీ కండిషన్లలో 205-215 కిలోమీటర్ల యూజబుల్ రేంజ్ ఇస్తుందని టాటా క్లెయిమ్ చేస్తోంది. అయితే ఈసారి చార్జింగ్ టెక్నాలజీని 40% వేగవంతం చేశారు. కేవలం 18 నిమిషాల ఫాస్ట్ చార్జింగ్‌తోనే దాదాపు 100 కిలోమీటర్ల రేంజ్ వచ్చేస్తుంది. అంతేకాదు ఈ నెక్స్ట్ జనరేషన్ ఈవీ కారుకు లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీ ఇస్తున్నట్లు టాటా సంచలన ప్రకటన చేసింది. ఈ ఈవీ కారు వాడటం వల్ల ఏటా రూ. లక్షా 42వేల నుండి లక్షా 50వేల రూపాయల వరకు ఇంధన ఖర్చు ఆదా అవుతుందని, 4-5 ఏళ్లలోనే కారు పెట్టిన పెట్టుబడి మొత్తం రికవర్ అయిపోతుందని కంపెనీ చెబుతోంది. 

చివరగా అందరూ ఎదురుచూసే ధరల విషయానికి వస్తే.. టాటా మోటార్స్ ప్రైసింగ్‌తో మార్కెట్‌ను ఊపేసింది. కొత్త టాటా టియాగో పెట్రోల్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ.4లక్షల 69వేలు కాగా, సీఎన్‌జీ మోడల్ ధర రూ.5లక్షల 79వేల నుండి ప్రారంభం అవుతుంది. ఇక అందరి దృష్టి ఆకర్షించిన అప్‌డేటెడ్ టాటా టియాగో EV ప్రారంభ ధరను కేవలం రూ.6లక్షల 99వేలుగా నిర్ణయించారు. ఈ ప్రైస్ ట్యాగ్‌తో పెట్రోల్ టియాగో కారు మారుతి వాగన్ఆర్, సెలెరియో, స్విఫ్ట్‌లకు గట్టి పోటీ ఇవ్వనుండగా.. టియాగో ఈవీ మార్కెట్లోని సిట్రోయెన్ eC3 వంటి వాటికి గట్టి సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది.