కేంద్రం కొనకపోయినా.. ధాన్యం కొనే బాధ్యత మాది

కేంద్రం కొనకపోయినా.. ధాన్యం కొనే బాధ్యత మాది

రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత ఎక్కడా లేదని.. జూన్ 4, 5 తేదీల్లో రుతుపవనాలు రానున్న నేపథ్యంలో ఆలోపే ధాన్యం, మక్కల కాంటాలు పూర్తి కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.హనుమకొండ జిల్లాలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన  ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ధాన్యం తరలింపు కోసం రవాణా శాఖ, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఇసుక లారీలను, ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను బలవంతంగానైనా ధాన్యం రవాణాకే ఉపయోగించాలని ఆర్టీఏ అధికారులకు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో చివరి గింజ వరకు ధాన్యం కొనే బాధ్యత మా ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా, రాష్ట్రానికి ఎంత ఆర్థిక భారమైనా సరే.. రైతుల కోసం పూర్తి స్థాయిలో ధాన్యం సేకరిస్తాం. కేంద్రం నిర్దేశించిన మద్దతు ధర, నిబంధనల ప్రకారమే ఈ కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ సీజన్‌లో మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 8.5 లక్షల మంది రైతులకు 8,400 కోట్ల రూపాయల నగదు చెల్లించామని.. ఇందుకోసం ఇప్పటివరకు 16,470 కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చి మరీ రైతులకు సకాలంలో చెల్లింపులు జరుపుతున్నామని స్పష్టం చేశారు.

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి, బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని.. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర (MSP) కల్పిస్తామని హామీ ఇచ్చారు.ధాన్యం నిల్వల కోసం అవసరమైతే ఇతర జిల్లాల గోడౌన్లను కూడా వాడుకోవాలని, తాలు, తరుగు విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, వెంటనే రవాణా నగదు చెల్లింపులు పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.