IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. కానీ, టోర్నీ ముగింపునకు వస్తున్న కొద్దీ.. ఐపీఎల్‌ను వివాదాలు, ప్రతికూల వార్తలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు మ్యాచ్‌లు హోరాహోరీగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నా, మరోవైపు ఈ లీగ్‌పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆ రెండు మ్యాచ్‌లపైనే అన్ని అనుమానాలు:
ఇటీవల జరిగిన క్వాలిఫయర్-1 (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్), ఎలిమినేటర్ (రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్) మ్యాచ్‌లు జరిగిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెగిటివిటీ వ్యక్తం అవుతోంది.
* ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్: ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 254 పరుగులు సాధిస్తే, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఏమాత్రం పోటీ ఇవ్వకుండా దారుణంగా కుప్పకూలిపోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.
* రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్: ఎలిమినేటర్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ 243 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో సన్‌రైజర్స్ కేవలం 196 పరుగులే చేసి ఘోర పరాజయంతో టోర్నీ నుంచే నిష్క్రమించింది.
* కీలకమైన మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్ ఆడిన జట్లు ఇలా చేతులెత్తేయడం వెనుక ఏదో 'స్క్రిప్ట్' ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. "ఐపీఎల్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్" అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. రోజురోజుకీ లీగ్‌పై ఆదరణ, విశ్వసనీయత తగ్గిపోతోందని కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
రికార్డు వ్యూయర్‌షిప్:
మరోవైపు, ఐపీఎల్ యాజమాన్యం ఈ నెగిటివిటీని కొట్టిపారేస్తూ వ్యూయర్‌షిప్ రికార్డులను తెరపైకి తెచ్చింది. ఈ సీజన్‌లో టీవీ వ్యూయర్‌షిప్ ఏకంగా 50 కోట్ల మార్కును దాటిపోయిందని, డిజిటల్, టీవీ కలిపి మొత్తం 1.1 బిలియన్ల వ్యూస్ వచ్చాయని ఐపీఎల్ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. డిజిటల్ విభాగంలో ఏకంగా 15 శాతం వృద్ధి నమోదైనట్లు లెక్కలు చూపిస్తున్నారు.
అయితే ఎంత వ్యూయర్‌షిప్ పెరిగినా.. సామాన్య క్రికెట్ ఫ్యాన్స్ లో రేకెత్తుతున్న ఫిక్సింగ్ అనుమానాలు, వివాదాలు టోర్నమెంట్ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల రూపాయల వ్యాపారంగా మారిన ఐపీఎల్‌లో క్రీడా స్ఫూర్తి కంటే స్క్రిప్టెడ్ మ్యాచులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే నెగిటివ్ టాక్ ఇప్పుడు ఐపీఎల్ టోర్నీ ఫైనల్ కి ముందు హాట్ టాపిక్‌గా మారింది.
