IAS, IPS జాబ్స్ కొట్టాలని ఎందరో కలగా పెట్టుకుంటారు. అందుకోసం రాత్రి, పగలు తేడా లేకుండా చదువుతుంటారు. ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి.. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కు దూరంగా ఉంటూ ఒక రకమైన యుద్ధం చేస్తుంటారు. ఎంతో మంది ప్రిపేర్ అయినా అందులో అందరూ సక్సెస్ అవుతారని చెప్పలేం. తమ చిరకాల స్వప్నం నెరవేరని పక్షంలో కొందరు చాలా డిజప్పాయింట్ కు గురవుతుంటారు. కొన్నిసార్లు మెంటల్ గా కంట్రోల్ పోయి ఏం చేస్తారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో ఒక మహిళ సిచువేషన్ కూడా అలాగే మారింది. పాపం తనకు కలెక్టర్ జాబ్ వచ్చిందనే భ్రమలో ఆమె చేసిన పనికి కాసేపు అధికారులు ఆందోళనకు గురికావాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం (నవంబర్ 05) మధ్యాహ్నం కామారెడ్డి కలెక్టరేట్ లో ఓ మహిళ హల్ చల్ చేసింది. ఐఏఎస్ సర్టిఫికెట్లతో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి.. తనకు కామారెడ్డి కలెక్టర్ గా ఉద్యోగం వచ్చిందంటూ హడావిడి చేసింది. తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో అధికారులను పరుగులు పెట్టించింది.
కుటుంబ సభ్యులతో కారులో బుధవారం మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ కార్యాలయంకు వచ్చిన మహిళ .. కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్చల్ చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డిఆర్ఓ మధుసూదన్.
డిఆర్ఓ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళగా గుర్తించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఐఏఎస్, ఐపీఎస్, మెయిన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న యువతి.. ఉద్యోగం రాక పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు మొదట భావించారు.
సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద సదురు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. 2020 నుంచి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోందని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని పోలీసుల నిర్ధారించారు. దీంతో మహిళపై చీటింగ్ కేసు పెట్టి ఆమెను వదిలేశారు.
కలెక్టర్ లేని సమయంలో ఇంఛార్జి కలెక్టర్ గా..
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నవంబర్ 2వ తేది నుంచి సెలవులో ఉండగా, ఇంచార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. దీంతో తన కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఇదే సరైన సమయం అని భావించిన ఇస్రత్ జహాన్ మహిళ.. నవంబర్ 4వ తేదీన కామారెడ్డి కలెక్టరేట్‌కు కారులో వచ్చింది. కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి, తనను ఇంచార్జి కలెక్టర్‌గా నియమించారని చెప్పింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు చూపించింది.
దీంతో ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని, పైనుండి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని మహిళకు అదనపు కలెక్టర్ తెలిపారు. అయినప్పటికీ కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడం అనుమానాలకు దారితీసింది. పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది.
