- మున్సిపల్ ఎలక్షన్ కోసం సీఎం రేవంత్రెడ్డి పర్యటన
- జిల్లాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం
- స్టేట్ డెలప్మెంట్కు ఇక్కడి నుంచే పునాది వేస్తానని ప్రకటన
- రూ.800 కోట్లకు మించి పనులకు శంకుస్థాపన
నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా క్యాడర్లో జోష్ నింపింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రావడంతో ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థ పరిధిలోని పార్టీ నేతలు, ప్రజలు తరలివచ్చారు. 5.20 గంటలకు మొదలైన సీఎం ప్రసంగం 6 గంటల వరకు సాగింది. ఆయన పదునైన కామెంట్స్‌కు జనం ప్రతిస్పందించారు.
బీజేపీ, బీఆర్ఎస్ లను ఎక్కుపెడుతూ ఘాటైన విమర్శలు చేశారు. మున్సిపాలిటీల నుంచి ప్రజలు కోరుకునే మోరీల క్లీనింగ్ ఇతర లోకల్ అంశాలు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని అంశాల కోసం ఢిల్లీ వెళ్లి మోదీని కలువాలా? అని చేసిన కామెంట్ సభికులను ఆలోచింపజేసింది. ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి కూడా విమర్శలు గుప్పించారు.
స్మార్ట్ సిటీ, ఎయిర్పోర్ట్ శాంక్షన్‌లో వైఫల్యం, ఫండ్స్ సాధనలో ఆయన విఫల్యాన్ని వివరించారు. తమ సర్కార్ మహిళా స్కీమ్‌లకు ఇస్తున్న ప్రయారిటీ అంకెలతో వివరించారు. ఫ్రీబస్ జర్నీ స్కీమ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ సభలో నవ్వులు పూయించాయి. ఆర్టీసీ బస్సులో ఎవరైనా టికెట్ అడిగితే మా అన్న చెబితే జర్నీ చేస్తున్నామని తన ఫొటో చూపమని మహిళలను కోరారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్‌కు కారకులంటూ...
పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతుల మాదిరి నిజామాబాద్ జిల్లా రైతులు చాలా చైతన్యవంతులని, పంట దిగుబడులకు సరైన రేట్ పొందడానికి, హక్కులు సాధించుకోడానికి ఎంతటి పోరాటానికైనా వెనక్కు తగ్గరని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 2022లో రైతుల ఆహ్వానం మేరకు జిల్లాకు వచ్చిన తాను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడేలా చేసిందన్నారు.
పార్టీకి ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎంను చేసిందన్నారు. అప్పటి నుంచి తనకు నిజామాబాద్ జిల్లా స్పెషల్‌గా మదిలో స్థిరపడి పోయిందన్నారు. రానున్న రోజుల్లో కూడా స్టేట్ డెవలప్మెంట్కు ఈ జిల్లా నుంచే పునాది వేస్తానన్నారు. 70 ఏండ్ల కింద జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రైతుల ఆత్మగౌరవం పెరిగేలా పంటలసాగుకు కారణమైందన్నారు. హెలిక్యాప్టర్ పై నుంచి చూస్తే దసరా పండగ రోజు పాలపిట్టలను చూసినట్లుందని అన్నారు. దాశరథిని కూడా గుర్తు చేశారు.
నెల కిందే ప్రోగ్రామ్ ఫిక్స్..
సీఎం ప్రోగ్రామ్ నెల కిందే ఫిక్స్ అయింది. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ దృష్ట్యా సభను రూరల్ సెగ్మెంట్లోని బర్దిపూర్‌లో ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సహచర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి హెలిక్యాప్టర్ దిగిన సీఎంకు గవర్నమెంట్ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు స్వాగతం చెప్పారు.
అఫీషియల్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా బోధన్, ఆర్మూర్, నిజామాబాద్‌లో రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన వేశారు. తెలంగాణ వర్సిటీలో బాయిస్, గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్స్, ఇండోర్ స్టేడియం, అడ్మిన్ బిల్డింగ్, ఏకలవ్య మోడల్ స్కూల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేసి వర్సిటీలోని సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్ చేశారు. గాంధీనగర్-బినోల రోడ్, సిరన్‌పల్లి-, నిజాంపూర్ రోడ్ విస్తరణ పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన వేశారు.
కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు పాత డిజైన్ ప్రకారం పూర్తి చేయాలి : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్‌రూరల్ : మంచిప్ప ప్రాంతంలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజీ పనులను పాత డిజైన్ ప్రకారం పూర్తి చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శుక్రవారం సీఎం సభలో ఆయన మాట్లాడారు. 21వ ప్యాకేజీ పనులు పూర్తైతే నియోజకవర్గవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.
నిజామాబాద్ మండలం గుండారం గ్రామ శివారులోని 500 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సెజ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్‌పోర్ట్‌కు అనుమతులు రానందున అక్కడున్న 800 ఎకరాల భూమిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సిబ్బంది కొరతను తీర్చి ఫార్మసీ కాలేజీ, ఫిజికల్స్పోర్ట్స్కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలిపారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అధునాతన గెస్ట్‌హౌస్ నిర్మించాలన్నారు. పలు సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.
