ఇటీవల నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల వాహనాలను తనిఖీ చేసే క్రమంలో డ్రైవర్ కారుతో చేసిన దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్ర గాయాలపాలై మరణించిన వార్త ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఒక మహిళా అధికారి తన విధి నిర్వహణలో భాగంగా ధైర్యంగా స్మగ్లర్లను వెంబడించినప్పుడు ఆమెకు ఎదురైన ఈ దుస్థితి మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎదుర్కొంటున్న ప్రాణాపాయానికి నిలువెత్తు నిదర్శనం. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, స్మగ్లింగ్ చేసే ముఠాలు ఈ రోజుల్లో అత్యాధునిక వాహనాలు, మారణాయుధాలతో బరి తెగిస్తున్నాయి. వారిని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్, ఫారెస్ట్, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాత్రం చాలా సందర్భాల్లో కేవలం లాఠీలతో లేదా వట్టి చేతులతో వెళ్లాల్సి వస్తోంది. ఇది వారిని నేరుగా మృత్యువు ఒడిలోకి నెట్టడమే అవుతుంది.
ఇదే విషయాన్ని అంతర్జాతీయ కోణంలో పరిశీలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో చట్టాన్ని అమలు చేసే అధికారుల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, ఇటీవల అమెరికాలోని మిన్నియాపాలిస్‌లో జరిగిన 'నికోల్ గుడ్' ఉదంతాన్ని చూడండి. ఒక ఐస్ కస్టమ్స్ అధికారిని ఆమె కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించిందని ఆ అధికారి తన ఆత్మరక్షణ కోసం ఆమెపై కాల్పులు జరిపారు. ఆ చర్యపై భిన్న వాదనలు, విచారణలు ఉన్నప్పటికీ, అక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం - విధి నిర్వహణలో ఉన్న అధికారికి తన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ప్రతిఘటించడానికి అతని చేతిలో 'ఆయుధం' ఉంది. కారును ఆయుధంగా
మార్చుకుని దాడి చేసే నేరస్థులను ఎదుర్కోగలిగే శక్తి వారికి ఉంది. కానీ మన దేశంలో స్మగ్లర్లు మన అధికారులపైకి కార్లతో, ట్రక్కులతో దూసుకొస్తున్నా, మన అధికారుల దగ్గర కనీసం గాల్లోకి కాల్పులు జరిపి వారిని భయపెట్టే ఆయుధం కూడా ఉండటం లేదు. మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వాస్తవానికి తుపాకీ తూటాల కంటే, నిర్లక్ష్యంగా నడిపే వాహనాల చక్రాల కిందే ఎక్కువ మంది నలిగిపోతున్నారు. ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్సులు సులభంగా జారీ అవుతాయి. కానీ, అదే సమయంలో 'తుపాకీ' అనగానే ఎక్కడ లేని గాంభీర్యాన్ని, భయాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. చట్టాన్ని రక్షించే బాధ్యత ఉన్న, కఠినమైన శిక్షణ పొందిన అధికారులకు కూడా ఆత్మరక్షణ కోసం 'ఆయుధాలు' ఇవ్వడానికి ప్రభుత్వాలు వెనకాడతాయి.
ఉద్దేశపూర్వకంగా వాహనాలతో తొక్కించి...
భారతదేశం అంతటా, ముఖ్యంగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా వంటి కేసులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిపై వాహనాలతో దాడి చేయడం అనేది అత్యంత సాధారణ, ప్రమాదకరమైన ఎత్తుగడగా మారింది. ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లు లేదా డంపర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించే అధికారులను తరచుగా ఉద్దేశపూర్వకంగా వాహనాలతో తొక్కించి చంపుతున్నారు. జనవరిలో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో అక్రమ కంకర రవాణా చేస్తున్న ట్రాక్టర్ -ట్రాలీ ఢీకొట్టడంతో ఫారెస్ట్ గార్డ్ జితేంద్ర సింగ్ షెకావత్ మరణించారు. గత నవంబరులో పాట్నాలో ఇసుక మాఫియా సభ్యులు నడుపుతున్న వాహనంతో ఢీకొట్టడంతో స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ జవాన్ దుఖహరన్ పాశ్వాన్ ప్రాణాలు కోల్పోయారు. 2024లో మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఇసుక ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ మహేంద్ర బగ్రీని చంపిన ఘటన, ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో అక్రమ మైనింగ్‌లో ఉన్న ట్రాక్టర్- ట్రాలీ ఢీకొని కానిస్టేబుల్ రోహిత్ కుమార్ పంచోలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలలో ఇటువంటి క్రూరత్వమే కనిపించింది. ఈ సందర్భంలో మనం 'పహల్గామ్' విషాదాన్ని గుర్తుచేసుకోవాలి. ఆ ఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో సామాన్యులే కాదు, దేశ రక్షణలో ఆరితేరిన నావల్ ఆఫీసర్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పోరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి, రైల్వే అధికారులు కూడా ఉన్నారు. వారు ఎంతటి శిక్షణ పొందినవారైనప్పటికీ, ఆ సమయంలో వారు నిరాయుధులు. చేతిలో ఆయుధం లేకపోవడంతో, ఆయుధాలతో విరుచుకుపడిన ముష్కరుల ముందు వారు నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. ఆత్మరక్షణకు అవకాశం లేక ప్రాణాలు వదలాల్సి వచ్చింది. ఆనాడు ఆ పర్యాటకుల బృందంలో లేదా ఆ అధికారుల వద్ద కనీసం ఒక్క రివాల్వర్ ఉన్నా పరిస్థితి మరోలా ఉండేదేమో? కొన్ని ప్రాణాలనైనా మనం దక్కించుకునే వాళ్ళమేమో? నేరస్థులు తమ దాడుల శైలిని మార్చుకుంటున్నప్పుడు, చట్టాన్ని రక్షించే వ్యవస్థలు కూడా మారాలి. అటవీ ప్రాంతాల్లో, మారుమూల ప్రదేశాల్లో విధులు నిర్వర్తించే అధికారులకు ఆయుధాలు సమకూర్చడం ఇప్పుడు తక్షణ అవసరం. ఆయుధం అనేది కేవలం దాడి చేయడానికి కాదు, అది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. కొందరు అధికారుల చేతిలో తుపాకీ ఉందని తెలిస్తే, నేరస్థులు దాడి చేయడానికి వెనకడుగు వేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచించాలి. స్మగ్లర్ల వేటలో మన అధికారులను నిరాయుధులుగా పంపడం అంటే వారిని బలిపశువులను చేయడమే. కానిస్టేబుల్ సౌమ్య వంటి ధైర్యవంతులైన అధికారుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వారికి తగిన ఆయుధ సంపత్తిని, శిక్షణను ఇవ్వడం ద్వారానే మనం చట్టాన్ని, చట్టాన్ని అమలు చేసే వారిని కాపాడుకోగలం.
- శ్రీనివాస్ మాధవ్,
‘51A అభీ ఫౌండేషన్’ వ్యవస్థాపక సభ్యుడు
