- కొనసాగుతున్న కార్డుల జారీ ప్రక్రియ
- లబ్ధిదారుల్లో ఆనందం
జనగామ, వెలుగు : రేషన్ కార్డుల కోసం గత సర్కారు హయాంలో ఇబ్బందులుపడ్డ పేదల బాధలు తొలగిపోయాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిరంతర ప్రక్రియగా కార్డుల జారీని చేపడుతోంది. గత జనవరి 26న మొదలైన పంపిణీ కొనసాగుతూనే ఉంది. లక్షలాది మంది పేదలకు మేలు జరుగుతోంది. ఫలితంగా లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది.
నాలుగు లక్షల మందికి పైనే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రేషన్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జనవరిలో ఆరు జిల్లాల్లో కలిపి 11,11,148 కార్డులు ఉండగా, వీటి పరిధిలో 32,49,580 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా, ప్రతీ నెల కొత్త కార్డుల జారీ శరవేగంగా జరుగుతుండడంతో వీటి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం కార్డుల సంఖ్య 12,37,479కి చేరగా, కుటుంబాల సంఖ్య 36,75,370కి చేరింది.
కొత్త కార్డులు 1,26,331 పెరుగగా, కుటుంబ సభ్యుల సంఖ్య 4,25,790 మందికి చేరింది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 20,764 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్మెంట్ ఉండగా, ఇప్పుడు 22,855 మెట్రిక్ టన్నులకు చేరింది.
జిల్లాల వారీగా..
జనగామ జిల్లాలో జనవరిలో 1,61,132 కార్డుల పరిధిలో 4,85,164 మంది కుటుంబ సభ్యులు ఉండేవారు. ఇప్పుడు కార్డుల సంఖ్య 1,84,224 కు చేరగా, కుటుంబ సభ్యులు 5,56,788కి చేరారు. వరంగల్ జిల్లాలో 2,66,661 కార్డులు, 7,87,439 మంది కుటుంబ సభ్యులు ఉండగా, ప్రస్తుతం 2,87,364 కార్డులు, కుటుంబ సభ్యులు 8,67,576 మందికి చేరారు. హనుమకొండలో 2,23,118 కార్డులు, 6,74,865 మంది ఉండగా, ఇప్పుడు 2,51,839కి కార్డుల సంఖ్య, 7,58,601 కుటుంబ సభ్యుల సంఖ్య చేరింది.
భూపాలపల్లి జిల్లాలో 1,23,453 కార్డులు, 3,44,470 మంది కుటుంబ సభ్యులుండగా, ఇప్పుడు 1,37,319 కార్డులు, 3,89,148 మంది కుటుంబ సభ్యులకు చేరారు. మహబూబాబాద్ జిల్లాలో 2,40,359 కార్డులు 7,04,796 మంది కుటుంబ సభ్యులు ఉండగా, ఇప్పుడు 2,75,079 కార్డులు, 8,13,853 కుటుంబ సభ్యులకు చేరారు. ములుగు జిల్లాలో 91, 425 కార్డులు, 2,52,846 మంది కుటుంబ సభ్యులు ఉండగా, ఇప్పుడు 1,01,654 కార్డులు, 2,89,404 కుటుంబ సభ్యులకు సంఖ్య చేరింది.
