వ్యర్థాలతో వనరుల పునరుద్ధరణ.. స్వచ్ఛ తెలంగాణాకు మార్గం..!

వ్యర్థాలతో వనరుల పునరుద్ధరణ.. స్వచ్ఛ తెలంగాణాకు మార్గం..!

వేగవంతమైన పట్టణీకరణ,  జనాభా పెరుగుదల కారణంగా ప్రతిరోజూ  పెద్ద మొత్తంలో మున్సిపల్ ఘన వ్యర్థాలను తెలంగాణ ఉత్పత్తి చేస్తుంది. అధికారిక డేటా,  ఇటీవల నివేదికల ప్రకారం కేవలం ఒక్క  హైదరాబాద్ నగరమే రోజుకు 8  నుంచి 9 వేల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తుంది.  స్థా నిక సంస్థలు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరణ చేస్తూ, పొడి, తడి వ్యర్థాలను వేరు చేయడం,  మెటీరియల్ రికవరీ సౌకర్యాల (ఎమ్మారెఫ్) ఏర్పాటును అమలు చేస్తున్నాయి.  శాస్త్రీయ పల్లపు ప్రదేశాలు,  ప్రాంతీయ ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో,  గ్రామ పంచాయతీలు చిన్న తరహా సేకరణ, విభజన, కంపోస్ట్ గుంటల ద్వారా వ్యర్థాలను నిర్వహిస్తాయి.  అయినప్పటికీ కొన్ని  గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ డంపింగ్ జరుగుతోంది.  

 కంపోస్టింగ్,  వనరుల పునరుద్ధరణ

సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగకరమైన ఎరువుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్రం కంపోస్టింగ్‌‌‌‌ను  ప్రోత్సహిస్తోంది.  అనేక యూఎల్బీలు  వికేంద్రీకృత  కంపోస్టింగ్ కేంద్రాలు,  బయోగ్యాస్ ప్లాంట్‌‌‌‌లను ఇప్పటికే ప్రారంభించాయి. ఉత్పత్తి చేసిన కంపోస్ట్‌‌‌‌ను  రైతులకు సబ్సిడీ ధరలకు సరఫరా చేస్తున్నారు. అయితే, చెత్తను ప్రాథమికంగా అసంపూర్ణంగా వేరు చేయడం వల్ల ఉత్పత్తి  అయిన  కంపోస్ట్ పరిమాణం మొత్తం సేంద్రీయ వ్యర్థాల కంటే తక్కువగా ఉంది.

వ్యర్థాల నుంచి ఇంధన ప్లాంట్లు

పునర్వినియోగపరచలేని వ్యర్థాలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రం వ్యర్థాల నుంచి  ఇంధనం(వేస్ట్ టు ఎనర్జీ - డబ్ల్యూటిఈ) ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. హైదరాబాద్ సమీపంలోని జవహర్‌‌‌‌నగర్‌‌‌‌లో  రోజుకు 5 వేల టన్నులకు పైగా వ్యర్థాలను ప్రాసెస్ చేసి  సుమారు 20–24  మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.   అదనపు డబ్ల్యూటిఈ  ప్లాంట్లు వరంగల్,  కరీంనగర్,  నిజామాబాద్‌‌‌‌లలో  ప్రతిపాదించడం జరిగింది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఆధారిత ప్రాజెక్టుల  నుంచి  ఇప్పటికే ఉన్న మొత్తం సామర్థ్యం దాదాపు 38 మెగావాట్లు.  ఈ ప్లాంట్లు భూమిలో  చెత్తను నింపడాన్ని తగ్గించడానికి, వ్యర్థాలను పునరుత్పాదక శక్తిగా మార్చడానికి సహాయపడతాయి.

పాత వాహనాలను ఈవీలతో భర్తీ చేయడం

డీజిల్​తో  నడిచే  చెత్త సేకరణ ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలతో (ఈవీ) మార్చడం వలన ఇంధన ఖర్చులు, శబ్ద కాలుష్యం,  కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఈవీలు  చెత్త సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా 
మునిసిపల్  కార్పొరేషన్లకు దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి. 

పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్యం

శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ భూగర్భజల కాలుష్యం, మిథేన్ ఉద్గారాలు, బహిరంగ డంపింగ్‌‌‌‌ను తగ్గిస్తుంది. కంపోస్టింగ్ నేల సారాన్ని  పునరుద్ధరిస్తుంది,  శుభ్రమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వాతావరణ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది,  జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది.   సరైన వ్యర్థాల తొలగింపు అనే ప్రక్రియ సేంద్రీయ,  తడి వ్యర్థాల పేరుకు పోవడాన్ని నిరోధిస్తుంది.  దోమల ఎదిగే ప్రదేశాలను నివారిస్తుంది. ఇది  డెంగ్యూ, మలేరియా ద్వారా సంక్రమించే వ్యాధుల  వ్యాప్తిని  నేరుగా తగ్గిస్తుంది.  దీంతో  ప్రజారోగ్యానికి రక్షణ లభిస్తుంది.  పరిశుభ్రమైన వాతావరణాలు వైద్య ఖర్చులను తగ్గిస్తాయి. 

స్థానిక సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు

డబ్ల్యూటిఈ  ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసిన కంపోస్ట్  అమ్మకాలు,  పునర్వినియోగపరచదగివి  విద్యుత్  నుంచి ఆదాయ ఉత్పత్తి  మునిసిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.  సమర్థవంతమైన వ్యవస్థలు, 
శాస్త్రీయ వ్యర్థాల సేకరణ, నిల్వ మొదలగునవి  ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి.

ప్రపంచ పద్ధతులు

అభివృద్ధి  చెందిన  అమెరికా,  యూరప్‌‌‌‌ లాంటి దేశాల్లో, కఠినమైన వ్యర్థాల విభజన, రీసైక్లింగ్ ప్రక్రియ, ఉత్పత్తిదారుల బాధ్యత, చట్టాలు అమల్లో ఉన్నాయి.   తెలంగాణలో  సమర్థవంతమైన  చెత్త నిర్వహణలో విభజన,  కంపోస్టింగ్,   రీసైక్లింగ్,  పునరుత్పాదక  ఇంధన మార్పిడి   సమగ్రంగా జరగాలి.  ఈ  క్రమంలో  తెలంగాణ స్వచ్ఛతకు అందరూ సహకరించాలి.  మనమందరం స్వచ్ఛ తెలంగాణ కేవలం స్థానిక సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలివేయకుండా సమష్టి బాధ్యతతో కృషి చేస్తే ఆరోగ్య,   ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతుంది.

‌‌‌‌‌‌‌‌- దురిశెట్టి మనోహర్, రిటైర్డ్​ ఏడీఈ