IND vs AUS: ఒక మాదిరి స్కోర్‌కే పరిమితమైన టీమిండియా.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?

IND vs AUS: ఒక మాదిరి స్కోర్‌కే పరిమితమైన టీమిండియా.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో పర్వాలేదనిపించింది. మొదట బ్యాటింగ్ చేసి ఒక మాదిరి స్కోర్ కే పరిమితమయ్యారు. గురువారం (నవంబర్ 6) క్వీన్స్‌ల్యాండ్ లో కర్రారా ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ (28), సూర్య కుమార్ యాదవ్ (20) కొన్ని మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. బార్ట్ లెట్,మార్కస్ స్టోయినిస్ లకు తలో ఒక వికెట్ దక్కింది.       

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు ఓపెనర్లు శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే లో పరుగుల వేగం తగ్గింది. దీంతో తొలి 6 ఓవర్లలో 49 పరుగులు రాబట్టి పర్వాలేదనిపంచింది. తొలి వికెట్ కు 55 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ (28) భారీ షాట్ కు ప్రయత్నించి జంపా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో గిల్ కు జత కలిసిన శివమ్ దూబే టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 32 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు. 

దూబే ఔటైనా సూర్య, గిల్ కలిసి పర్వాలేదనిపించారు. భారీ స్కోర్ ఖాయమనుకుంటే ఒక్కసారి కుదేలయ్యారు. హాఫ్ సెంచరీకి సమీపంలో ఉన్న గిల్ ను ఎల్లిస్ క్లీన్ బౌల్డ్ చేస్తే.. వెంటనే సూర్యను బార్ట్ లెట్ పెవిలియన్ కు చేర్చాడు. మూడో టీ20లో సత్తా చాటిన జితేష్ శర్మను జంపా కేవలం 3 పరుగులకే ఔట్ చేశాడు. తిలక్ వర్మ కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో ఇండియా 136 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో అక్షర్ పటేల్ (21) కొన్ని మెరుపులు మెరిపించి జట్టు స్కోర్ ను 160 పరుగుల మార్క్ కు చేర్చారు.