న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా 'ఎ'తో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ కోసం ఇండియా 'ఎ' టీమ్ ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. 14 మందితో కూడిన భారత ఏ జట్టును ఆసియా కప్ ఫైనల్ హీరో, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుత్ రాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియా ఏతో జరిగిన సిరీస్‌లో ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ గత నెలలో సిడ్నీలో గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం ఇంకా నయం కాకపోవడంతో అయ్యర్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.
రంజీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్‌కు జట్టులో స్థానం దక్కింది. యంగ్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఎంపికయ్యారు. అయితే.. దక్షిణాఫ్రికా ఎ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా ఎ జట్టులో టీమిండియా దిగ్గజ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి స్థానం దక్కలేదు.
2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా కోహ్లీ, రోహిత్ ఈ సిరీస్ ఆడతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు జట్టుకు ఎంపిక కాకపోవడంతో వారి భవిష్యత్తుపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, 2025, నవంబర్ 13 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో దక్షిణాఫ్రికా, భారత 'ఎ' జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ జరగనుంది.
దక్షిణాఫ్రికా 'ఎ' సిరీస్ కోసం ఇండియా 'ఎ' జట్టు:
తిలక్ వర్మ (c), రుతురాజ్ గైక్వాడ్ (vc), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (wk), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (wk)
