"నేనేం సాగర సంగమం తీశానని చెప్పానా? రివ్యూయర్లపై నిర్మాత నాగవంశీ సెటైర్లు!

"నేనేం సాగర సంగమం తీశానని చెప్పానా?  రివ్యూయర్లపై నిర్మాత నాగవంశీ సెటైర్లు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాత నాగవంశీ స్టైలే వేరు. సినిమా రిజల్ట్ ఏదైనా సరే, ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఈ రోజు ( ఫిబ్రవరి 13, 2026 )  విశ్వక్ సేన్, అనుదీప్ కె.వి. కాంబినేషన్‌లో తెరకెక్కించిన 'ఫంకీ' మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ  సినిమా పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో నాగవంశీ తనదైన శైలిలో స్పందిస్తూ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సైంటిస్టుల్లా ఫీల్ అవ్వకండి!

రివ్యూల గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా రివ్యూయర్లకు నచ్చదని నాకు ముందే తెలుసు. మీరు ఏదో సైంటిస్టుల్లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా కదా! ఈ సినిమాలో లాజిక్కులు ఉండవు, సీన్ కి సీన్ కి సంబంధం ఉండదు అని ప్రమోషన్స్ అప్పుడే క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు వచ్చి ఎడిటింగ్ బాలేదు అంటే ఎలా? మేము కావాలనే అలా తీశాం. అది ఎడిటింగ్ లోపం కాదు, సినిమా ఫార్మాట్ అది అంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు.  నేనేమైనా సాగర సంగమం లాంటి క్లాసిక్ తీశానని చెప్పానా? కేవలం నవ్వించడానికి తీసిన సినిమా ఇది. మీ 150 రూపాయల టికెట్ రేటుకు పూర్తి న్యాయం చేస్తాం అని ఆయన చేసిన కామెంట్స్  విస్మయానికి గురిచేస్తున్నాయి.

 

అనుదీప్‌తో సినిమా అంటే రిస్కే!

'జాతిరత్నాలు'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ ఉంటుందని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి తనకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో గ్లామర్ లేదన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరిస్తూనే, వినోదాన్నే ప్రధానంగా నమ్ముకున్నామని చెప్పుకొచ్చారు.

►ALSO READ | నిలవే మూవీ రివ్యూ: మరో అర్జున్ రెడ్డి వచ్చేసినట్టేనా? ఎమోషనల్ లవ్ స్టోరీ వర్కౌట్ అయ్యిందా?

నిజంగా ప్రేక్షకులు నవ్వుతున్నారా?

నిర్మాత ఎంత ధీమాగా ఉన్నా, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. కేవలం వన్-లైనర్ల మీద ఆధారపడి సినిమాను నడపడం వల్ల సాధారణ ప్రేక్షకులు నీరసించిపోతున్నారు. మేము కావాలనే ఎడిటింగ్ అలా చేశాం" అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రయోగం ప్రేక్షకుడికి తలనొప్పిగా మారడం మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో యావరేజ్ సినిమాలకే థియేటర్ల వద్ద ఆక్యుపెన్సీ కష్టమవుతోంది. అలాంటిది, "కథ లేదు.. కావాలనే లాజిక్ లేకుండా తీశాం" అనే వాదన బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందనేది ప్రశ్నార్థకమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

వీకెండ్ గట్టెక్కుతుందా?

విశ్వక్ సేన్ మార్కెట్ ,సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్రాండ్ వాల్యూ వల్ల వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ, సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ మీమ్స్, డిస్‌జాయింటెడ్ సీన్స్ పై వస్తున్న విమర్శలను తట్టుకుని 'ఫంకీ' నిలబడటం కాస్త కష్టమే అనిపిస్తోందంటున్నారు ప్రేక్షకులు. నాగవంశీ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా లేక 'ఫంకీ' కేవలం ప్రయోగంగానే మిగిలిపోతుందా అనేది మరో వారంలో తేలిపోనుంది.