నిలవే మూవీ రివ్యూ: మరో అర్జున్ రెడ్డి వచ్చేసినట్టేనా? ఎమోషనల్ లవ్ స్టోరీ వర్కౌట్ అయ్యిందా?

నిలవే మూవీ రివ్యూ: మరో అర్జున్ రెడ్డి వచ్చేసినట్టేనా? ఎమోషనల్ లవ్ స్టోరీ వర్కౌట్ అయ్యిందా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. భాషా భేదం లేకుండా, కేవలం భావోద్వేగాలనే నమ్ముకుని వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సరిగ్గా అదే బాటలో, ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) కానుకగా ఒక రోజు ముందే, అంటే ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'నిలవే'. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ట్రైలర్‌తోనే 'అర్జున్ రెడ్డి' తరహా ఇంటెన్సిటీని చూపిస్తూ భారీ బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో విశ్లేషణలో చూద్దాం..

కథేంటంటే..

అర్జున్ (సౌమిత్ రావు) ఒక ప్రతిభావంతుడైన అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. వృత్తిపరంగా సక్సెస్ ఉన్నప్పటికీ, అనాథ అయిన అర్జున్ జీవితంలో ఒంటరితనం అతడిని నీడలా వెంటాడుతుంటుంది. తనకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుందని పరితపించే అర్జున్, చివరికి డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా తాను తనువు చాలించాలనుకుంటున్న క్షణంలో, ఎదురు అపార్ట్‌మెంట్‌లో అతనికి 'అతిథి' (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. ఆమెను చూడగానే అర్జున్ మళ్ళీ జీవితంపై ఆశ పెంచుకుంటాడు. అతిథితో పరిచయం కాస్తా సాన్నిహిత్యానికి దారితీస్తుంది. వీరిద్దరూ శారీరకంగా కూడా దగ్గరవుతారు. కానీ, అర్జున్ తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు అతిథి దానిని అంగీకరించదు. అసలు అతిథి తన ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏమిటి? పెళ్లి, పిల్లలు, ఒక అందమైన కుటుంబం ఉండాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? ఈ కథలోకి శాంతను అనే పాత్ర ఎందుకు వచ్చింది? చివరకు వీరిద్దరి ప్రయాణం ఎటు వైపు సాగింది? అన్నదే మిగిలిన కథ.

భావోద్వేగాల ప్రయాణం

దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం ఒక సున్నితమైన పాయింట్‌ను ఎంచుకుని దానిని తెరపై ఆవిష్కరించడంలో  సక్సెస్ అయ్యాడని సినీ ప్రియుల నుంచి టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రారంభంలో హీరో పడే ఒంటరితనాన్ని చూపించిన విధానం ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా సూసైడ్ సీన్ వద్ద హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం అనేది స్క్రీన్ ప్లేలో ఒక మంచి మలుపు తిరుగుతుందంటున్నారు ప్రేక్షకులు.

►ALSO READ | మలయాళ హిట్ మూవీకి తెలుగులో షాక్.. ప్రేక్షకులు లేక తొలి షోలు రద్దు!

ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సన్నివేశాలతో ఆహ్లాదకరంగా సాగుతుంది. 'అర్జున్ రెడ్డి' తరహాలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ, అవి కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప అసభ్యంగా లేవు. ఇక సెకండాఫ్‌లో సినిమా అసలు రంగు బయటపడుతుంది. హీరోయిన్ ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు గుండెకాయ లాంటిది. ఒక అమ్మాయి ఎందుకు ఒంటరిగా ఉండాలనుకుంటుంది అనే కోణాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి ప్రేక్షకుడి కళ్లు చెమర్చడం ఖాయం అంటున్నారు సినీ ప్రియులు. అయితే, అక్కడక్కడా కథనం కొంత నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్ ఇచ్చే ఇంపాక్ట్ ఆ లోపాలను కప్పివేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

నటీనటుల పర్ఫార్మెన్స్

సౌమిత్ రావు తొలి సినిమానే అయినా, అర్జున్ పాత్రలోని తీవ్రతను, బాధను, ప్రేమను అద్భుతంగా పండించాడు. ఆయన నటనలో ఎక్కడా కొత్తవాడనే ఛాయలు కనిపించవు. లుక్స్ పరంగా బాలీవుడ్ హీరోలా కనిపిస్తూనే, నటనలో మెచ్యూరిటీ చూపించాడు. ఇక శ్రేయాసి సేన్ అతిథి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది. భావోద్వేగాలను పండించడంలో ఆమెకు వందకు వంద మార్కులు వేయొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీ టైమింగ్‌తో సీరియస్ కథలో మంచి రిలీఫ్ ఇచ్చాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు మెప్పించారు. అయితే కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే సన్నివేశాలు కాస్త మైనస్ గా నిలుస్తున్నాయి.

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు అతిపెద్ద బలం కళ్యాణ్ నాయక్ సంగీతం. పాటలు వినసొంపుగా ఉండటమే కాకుండా, నేపథ్య సంగీతం ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. దిలీప్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఉన్నతంగా ఉన్నాయి. "నిలవే" కేవలం ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, జీవితంపై ఆశ కోల్పోయిన వారికి ఒక చిన్న భరోసా. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ వాలెంటైన్ వీకెండ్‌లో మంచి ఎమోషనల్ రైడ్‌ను కోరుకునే వారికి 'నిలవే' ఒక బెస్ట్ ఆప్షన్ అంటున్నారు సినీ ప్రియులు.