హైదరాబాద్: తెలంగాణలో 116 మున్సిపాలిటీలతో పాటు ఏడు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో హవా కొనసాగించింది. నల్గొండ, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా దాదాపుగా హస్తం పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. రెండు స్థానాల్లో బీజేపీ.. ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్ల నుంచి 2 వేల 225 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
* రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసింది. రామగుండం కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 38 డివిజన్లలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 13 స్థానాలకే పరిమితం అయింది.
* మంచిర్యాల కార్పొరేషన్ను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. 39 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. 8 స్థానాల్లో బీఆర్ఎస్, 4 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
* కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. మొత్తం 66 స్థానాల్లో 29 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా, 14 కాంగ్రెస్, 11 ఇతరులు, ఎంఐఎం 5, బీఆర్ఎస్ 7 డివిజన్లలో ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
►ALSO READ | ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక అభినందనలు..
* కొత్తగూడెం కార్పొరేషన్లో కమ్యూనిస్టుల హవా నడిచింది. అయితే హంగ్ మాత్రం తప్పలేదు. కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను సీపీఐకి 22 స్థానాలు, కాంగ్రెస్కు 22 స్థానాలు దక్కాయి. మిగతా చోట బీఆర్ఎస్ 8, బీజేపీ, సీపీఎం చెరో స్థానం, స్వతంత్రులు ఆరు చోట్ల గెలిచారు. సీపీఐకి కేటీఆర్ అన్ కండిషనల్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉంటే మద్దతిస్తామని.. మేయర్ సీటును కూడా సీపీఐకే ఆయన ఆఫర్ చేయడం విశేషం. బీఆర్ఎస్ ఆఫర్తో ఇప్పుడు బంతి సీపీఐ కోర్టులో ఉంది.
* నల్గొండ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 10 స్థానాలు, బీజేపీ 02, స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు.
* నిజామాబాద్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ ముందుకెళుతోంది. మొత్తం 60 డివిజన్లకు గాను 30కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇప్పటికే 12 డివిజన్లలలో బీజేపీ గెలిచింది.
* మహబూబ్ నగర్ కార్పొరేషన్ 30 డివిజన్లకు కౌంటింగ్ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఆధిక్యం కనబర్చింది. కాంగ్రెస్ పార్టీ 14 డివిజన్లలో గెలిచింది. బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, ఎంఐఎం ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. 31 నుంచి 60 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది.
