రాక్షసి సాచిన నాలుకలా రోడ్లు.. ఈ ప్రమాదాలకు కారకులు ఎవరు ?

రాక్షసి సాచిన నాలుకలా రోడ్లు.. ఈ ప్రమాదాలకు కారకులు ఎవరు ?

రోడ్లని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది.  రోడ్లని ప్రయాణికులకు అనుకూలంగా ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా సురక్షితంగా ఉంచడం వాటిని నిర్వహించే అధికారుల బాధ్యత. సుప్రీంకోర్టు,  హైకోర్టులు ఈ విషయంలో పదేపదే  ఆదేశాలను జారీ చేసినప్పటికీ అధికారులు ఈ బాధ్యతలను  నిర్వర్తించడంలో విఫలమవుతున్నారని ఇటీవల బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.  రోడ్లని సక్రమంగా నిర్వహించి, సురక్షితంగా ప్రయాణం చేసేవిధంగా చూడటం ప్రభుత్వ రాజ్యాంగ విధి అని బొంబాయి హైకోర్టు నొక్కి చెప్పింది. 

 పదేపదే ఆదేశాలు జారీ చేసినప్పటికి అధికారులు తమ రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించడంలో విఫలం అవుతున్నారని కోర్టు పేర్కొంది. 2013లో బొంబాయి హైకోర్టు తమకు తాముగా స్వీకరించిన కేసులో నష్టపరిహారాలు చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. గుంతలు, తెరిచిన మ్యాన్​హోల్స్ వల్ల కలిగిన గాయాలకు రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు, మరణాలకు రూ.6లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడితో కోర్టు ఊరుకోలేదు. ఈ చెల్లించిన మొత్తాలను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని  ఆదేశించింది. ఇది ఒక్క ముంబయి రోడ్లకు సంబంధించినదే కాదు. దేశంలో చాలారోడ్లు అదేవిధంగా గుంతలతో,  తెరిచిన మ్యాన్​హోల్స్​తో ఉన్నాయి. 

చే పా  చేపా ఎందుకు ఎండలేదన్న విషయంగా ఈ విషయంలో జవాబులు ఉంటాయి.  రోడ్ల నిర్వహణ, నిర్మాణం, బాధ్యతలో  రాజకీయ నాయకుల దగ్గర నుంచి మంత్రివర్గ అధికారుల వరకు, క్షేత్రస్థాయి అధికారులు, కాంట్రాక్టర్లు ఇట్లా చాలామంది పాత్ర ఉంటుంది. జవాబుదారీతనం భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో జవాబు ఉంటుంది. తమది తప్పు కాదని మరొకరిది తప్పని అందరి జవాబు ఉంటుంది. తమది తప్పు కాదని మరొకరిది తప్పని అందరూ అంటారు.  వర్షాలు, ఇతర బాహ్య కారణాలను ప్రస్తావించి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  సురక్షితమైన రోడ్లని నిర్వహించడం, ఆ విధమైన సౌకర్యాలను కలిగి ఉండటం ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది.  రోడ్లని నిర్వహించడం, అభివృద్ధి చేయడం రాష్ట్రాల బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా రోడ్లు సక్రమంగా నిర్వహించడం కోసం సుప్రీంకోర్టు ఇటీవల పాన్​ ఇండియా మార్గదర్శకాలను రూపొందించాలని  కేంద్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది.  రోడ్డు  భద్రతలో..  రోడ్ల రూపకల్పన, నిర్మాణం, ట్రాఫిక్​ నియమాలు వినియోగదారులకు అవగాహన కల్పించడం వంటివి ఉంటాయి.

కొరవడిన జవాబుదారీతనం

మన దేశంలోని  రోడ్లు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ప్రమాదకరంగా ఉన్నాయి. దీనికి నిదర్శనం రోడ్డు ప్రమాదాల సంఖ్య, అందువల్ల సంభవించే మరణాలు.  ప్రతిరోజూ దాదాపు  462 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. సహజ మరణాల కన్నా రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తొక్సిసలాట మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అది శ్రీకాకుళం తొక్కిసలాట కావొచ్చు.  కుంభ్​ విషాదం కావొచ్చు.  ఢిల్లీ  రైల్వే స్టేషన్​ ట్రాజెడీ కావొచ్చు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం సంఘటన కావొచ్చు.  తమిళనాడులో కరూర్​లోని రాజకీయ  సమావేశం కావొచ్చు.  పుష్ప సినిమా దుర్ఘటన కావొచ్చు. తొక్కిసలాటలకి కారణాలు వేరు. ఎక్కువగా జనం గుమిగూడటం కావొచ్చు.  సరైన వసతులు లేకపోవడం కావొచ్చు. అవసరమైన పోలీసు బందోబస్తు లేకపోవడం కూడా కావొచ్చు. ఈ తొక్కిసలాటలు ఎక్కువగా మతపరమైన సమావేశాల్లో, రాజకీయ ర్యాలీల్లో,  సినిమా నటుల వల్ల కావొచ్చు.  అక్కడ  జమకూడే ప్రజానీకాన్ని దృష్టిలో  పెట్టుకుని తగుచర్యలు ముందుగా తీసుకుంటే వీటిని నివారించవచ్చు. వీటన్నిటికి  కారణం జవాబుదారీతనం లేకపోవడం, బాధ్యులపై తగు చర్యలు వెంటనే తీసుకోకపోవడం. 

ఈ ప్రమాదానికి కారకులు ఎవరు?

ఆధునిక సమాజంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు మన జీవితంలో భాగమైపోయాయి.  క్షణంలోని సగం వంతు నిర్లక్ష్యం ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం అంటే ఊహించనిదే. కానీ, చేవెళ్ల రోడ్డు ప్రమాదం అలాంటిది కాదు.  మీర్జాగూడ  దగ్గర  జరిగిన సంఘటనని నివారించే అవకాశం ఉంది. 19 మంది మరణం తెలంగాణ ప్రజలను విభ్రాంతికి గురి చేసింది.  కలచివేసింది. హృదయ విదారకమైన దృశ్యాలను చూసి కలత నిద్రలో  బెదిరిన వ్యక్తులు ఎందరో.  ఎన్నో ప్రశ్నలను  ఈ సంఘటన మిగిల్చింది.  అవి.. ఈ ప్రమాదానికి కారకులు ఎవరు?   డ్రైవరులా, ప్రభుత్వ అధికారులా,  స్థానిక రాజకీయ నాయకులా,  కాంట్రాక్టర్లా ? ఆర్టీసీ యాజమాన్యమా? ఎవరు.. ఈ ప్రమాదానికి కారకులు?. బస్సులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. 75మంది వరకు ఉన్నారు. కండక్టరు, బస్సు డ్రైవర్లు అదనం. భారంగా కదులుతున్న బస్సు ఎదురుగా ఎలాంటి తగు జాగ్రత్తలు లేని కంకర లారీ.  ప్రమాదానికి కంకర లారీ డ్రైవరే కారణమా? అంత హెవీ లోడ్​ను అనుమతించిన రవాణా అధికారులదా? సరైన రోడ్లు లేకపోవడం కారణమా? 

రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు  ప్రమాదాలు

చేవెళ్ల–హైదరాబాద్​ రోడ్డు సరిగా లేదు. అనేక మలుపులు, ఇరుకైన దారి దాన్ని విస్తరించలేదు. ఆ దారిలో  ప్రయాణం చేస్తున్న వాహనాల సంఖ్య అధికం. రోజురోజుకీ ఈ వాహనాలు పెరిగిపోతున్నాయి. ఈ రోడ్డుని వెడల్పు చేయాలన్న డిమాండ్​ చాలాకాలంగా ఉంది.  వెడల్పు చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో?  చెట్ల నరికివేత కారణంగా చెబుతున్నారు. ఏమైనా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించి మంచి రోడ్లను వేయాల్సిన బాధ్యత స్థానిక రాజకీయ నాయకులపై ఉంది.  నెపాన్ని ఒకరి మీద నుంచి మరొకరిపైకి నెట్టవచ్చు. అది సులువు.  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో రోడ్డు నిర్మాణం ముఖ్యమైనది. అది ఆధునిక ఆర్థిక అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం.  ప్రజలు సుఖంగా ప్రయాణం చేయడానికి కాదు. సుదూర ప్రాంతాలకు వస్తువులను సులభతరంగా పంపించవచ్చు. మంచి రోడ్డు ఆర్థికంగా రాష్ట్రాలని, దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అయితే, మన దేశంలో రోడ్ల విస్తరణ, వాటి నిర్వహణ అనుకున్నవిధంగా లేదు. రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొంతమంది జీవితాల్లో  రోడ్డు  ప్రమాదాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 

ప్రతి సంవత్సరం 4.6 లక్షల ప్రమాదాలు

కేంద్ర  రోడ్డు రవాణా,  రహదారుల మంత్రి  నితిన్​గడ్కరీ  ప్రకారం  ప్రతి సంవత్సరం 4.6 లక్షల ప్రమాదాలు  జరుగుతున్నాయి.  దీనివల్ల 1.68 లక్షల మంది మరణిస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే దేశం మనది.  ఈ  ప్రమాదాలు ఎక్కువగా నివారించగలిగేవే.  కానీ, ఆ దిశగా సరైన  ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఈ  ప్రమాదాలు ఎక్కువగా జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్నాయి. ఈ రహదారులపై  డ్రైనేజీ  వంటి  ప్రాథమిక ఇంజినీరింగ్​ డిజైన్లు ఉండవు.  దానివల్ల  గుంతలు ఏర్పడతాయి. చివరికి అవి మరణానికి ఉచ్చులుగా మారుతున్నాయి. చేవెళ్ల ప్రమాదం విషయానికి వస్తే అది ఊహకు అందని ప్రమాదం. కంకర రాళ్ల మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోవడం హృదయాలను కలిచివేసే దృశ్యం. చివరికి ప్రమాద కారణం బస్సు డ్రైవరుదా,  కంకర లారీ డ్రైవరుదా?  సరైన రోడ్లను నిర్వహించలేని  ప్రభుత్వానిదా? ఎవరిదైనా ఈ ప్రమాదం మానవ తప్పిదంగా అనిపించడం లేదు. మానవ నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. అందులో అందరూ ఉన్నారు.  ఏమైనా అత్యంత విషాదాన్ని నింపిన ప్రమాదం చేవెళ్ల రోడ్డు ప్రమాదం.  

అమ్మలారా..! బిడ్డల్లారా..
‘ఈ భూప్రపంచంలో దేనికీ భయపడని నేను 
ఈ రోడ్డుకి భయపడతాను
నాకీ రోడ్డు
రాక్షసి సాచిన నాలుకలా కనిపిస్తోంది’.

- డా. మంగారి రాజేందర్, 
జిల్లా జడ్జి (రిటైర్డ్)