పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో లఖిసరాయ్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి, లఖిసరాయ్ బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఓట్ హక్కు వినియోగించుకోవడానికి వెళ్లగా విజయ్ సిన్హా కారును అడ్డుకుని చెప్పులు, రాళ్లు విసిరారు ఆర్జేడీ మద్దతుదారులు.
విజయ్ సిన్హా, బీజేపీ ముర్దాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాన్వాయ్‌ను ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టి విజయ్ సిన్హా కాన్వాయ్‌కు లైన్ క్లియర్ చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై విజయ్ సిన్హా మాట్లాడుతూ.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందనే భయంతో ఆర్జేడీ గుండాలు గూండాయిజానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఖోరియారి గ్రామంలోని కొన్ని బూత్‌లలోకి తన పోలింగ్ ఏజెంట్లను ఆర్జేడీ గూండాలు అడ్డుకున్నారని సిన్హా ఆరోపించారు. మా పోలింగ్ ఏజెంట్లను బెదిరించి ఓటు వేయ్యనివ్వలేదన్నారు. ఓటమి భయంతో ఆర్జేడీ, కాంగ్రెస్ బెదిరింపు వ్యూహాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు.
ఆర్జేడీ మద్దతుదారులను అడ్డుకోవడంలో విఫలమైన జిల్లా పోలీసులను పిరికివారని విమర్శించారు. లఖిసరాయ్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్‌పై దాడి ఘటనపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. శాంతిభద్రతలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించబోమని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించారు.
►ALSO READ | ముంబైలో 3 కోట్ల హుక్కా ఫ్లేవర్స్ పట్టివేత.. బాక్సుల్లో పెట్టి మరి సప్లయ్.. మోస్ట్ వాంటెడ్ అరెస్ట్..
ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా మొత్తం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. తొలిదశలో పోటీ పడుతున్న వారిలో ఆర్జేడీ అగ్రనేత, మహాఘట్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌తో పాటు బీజేపీ సీనియర్ లీడర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తదితరులు ఉన్నారు.
వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మరోమారు ఇక్కడి నుంచే పోటీచేస్తున్న తేజస్వీ.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున సతీశ్ కుమార్ బరిలో ఉన్నారు.
