న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో శిఖర్ ధావన్, సురేష్ రైనాకు సంబంధించిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రైనా పేరు మీద ఉన్న రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ధావన్ పేరు మీద ఉన్న రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని తాత్కలికంగా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లు ఈడీ అటాచ్ చేసిన ఆస్తులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపలేరు.
ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్‌లకు సంబంధించి శిఖర్ ధావన్, సురేష్ రైనాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా ఈ యాప్‌లకు ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి డబ్బును హవాలా రూపంలో తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సురేష్ రైనా, ధావన్‌లను విచారించిన ఈడీ.. ఇద్దరు మాజీ క్రికెటర్లు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి ఆస్తులను తాత్కలికంగా ఈడీ అటాచ్ చేసింది.
ఇదే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులోభారత మాజీ క్రికెటర్లు ఊతప్ప, యువరాజ్ సింగ్‌ను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అలాగే.. బాలీవుడ్ యాక్టర్స్ ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి, సోనూసూద్‌లను కూడా ఈడీ ఇంటరాగేట్ చేసింది. ధావన్, రైనా ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో మిగిలిన వారిలో ఆందోళన మొదలైంది.
2024 ఆగస్టు లో ధావన్ అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధవన్.. 14 ఏళ్ల కెరీర్‌లో 167 మ్యాచ్‌లు ఆడాడు. 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు సహా 6793 రన్స్ చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌తో చివరి వన్డేలో పోటీపడ్డాడు.
2013లో మొహాలీలో ఆసీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన ధవన్.. 2018లో ఇంగ్లండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. 34 టెస్టుల్లో 2315 రన్స్ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 ఫిఫ్టీలు ఉన్నాయి. సగటు 40.61గా ఉంది. 2011లో వెస్టిండీస్‌పై తొలి టీ20 ఆడిన ధవన్ 68 మ్యాచ్‌ల్లో 27.92 సగటుతో 1759 రన్స్ చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
