ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ తగ్గేదే లేదంటున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. బౌలర్ ఎవరైనా విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో 112 పరుగులు చేసి ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ యావరేజ్ 37.33 కాగా.. స్ట్రైక్ రేట్ 167.16. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇండియాలో కోహ్లీ రికార్డుపై కన్నేశాడు.
అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 36.96 యావరేజ్ తో 192.20 స్ట్రైక్ రేట్‌తో 961 పరుగులు చేశాడు. 1000 పరుగులు పూర్తి చేయడానికి అభిషేక్ ఇంకా 39 పరుగుల దూరంలో ఉన్నాడు. గురువారం (నవంబర్ 6) ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టీ20లో అభిషేక్ 39 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఇండియా తరపున ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన ప్లేయర్ గా కోహ్లీ రికార్డ్ సమం చేస్తాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేసి టాప్ లో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ మలన్ ఉన్నాడు.ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ కేవలం 24 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకొని ఆల్ టైం టాప్ లో ఉన్నాడు.
ఇటీవలే అభిషేక్ శర్మ ఐసీసీ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు అందుకున్న బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఆసియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన అభిషేక్.. 2020లో డేవిడ్ మలాన్ (919 పాయింట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసియా కప్ లో ఈ పంజాబీ స్టార్ 314 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. యావరేజ్ 44 కాగా.. స్ట్రైక్ రేట్ 200 కావడం విశేషం. ఈ క్రమంలో అభిషేక్ తన టీమ్ మేట్స్ సూర్యకుమార్ యాదవ్ (912), విరాట్ కోహ్లీ (909) హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లను కూడా అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం (నవంబర్ 6) టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్ లు ముగిస్తే 1-1 తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరిగితే ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయంసాధించి 1-1 తో సమం చేసింది.
