Gen–Z (జనరేషన్ – జడ్).. 1997 నుంచి 2012 మధ్య పుట్టినోళ్ల మెంటాలిటేనే వేరు.. ఇదో ఇన్స్టంట్ బ్యాచ్ !

Gen–Z (జనరేషన్ – జడ్).. 1997 నుంచి 2012  మధ్య పుట్టినోళ్ల మెంటాలిటేనే వేరు..  ఇదో ఇన్స్టంట్ బ్యాచ్ !

ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన తరం ఉంటుంది. 21వ శతాబ్దపు శబ్దాల మధ్య రూపుదిద్దుకున్న  ప్రపంచం ముందు పెను సవాళ్లుగా మారిన సరికొత్త ప్రశ్నలకు, సమాధానాలు వెతుకుతున్న తరం జెన్-జీ(జనరేషన్ - జడ్). 1997 నుంచి 2012 మధ్య కాలంలో జన్మించిన యువత.  ఇది మునుపటి తరాలకన్నా భిన్నంగా ఆలోచించే, స్పందించే, జీవించే తరం. ఈ  తరం సభ్యులు ‘డిజిటల్ నేటివ్స్’. వారికి సమయం, భౌగోళిక సరిహద్దులు పెద్దగా అర్థం కావు. సమాచారం తక్షణమే కావాలి, వ్యవస్థలు తక్షణమే స్పందించాలి.  ఇలాంటి మానసిక నిర్మాణంలో పెరిగిన వారు వాతావరణ మార్పులు,  లింగ సమానత్వం, మానవ హక్కుల అంశాలపై బలమైన నిబద్ధతను కనబరుస్తున్నారు.

సాంకేతిక విప్లవం రెండు అంచుల కత్తి

 గ్రెటా థన్​బర్గ్​ ప్రారంభించిన ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ ఉద్యమం,  ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి  టిక్​టాక్, ఇన్​స్టాగ్రామ్​ వేదికలుగా మారిన సందర్భాలు, ఈ తరపు సామాజిక స్పృహను గాఢంగా ప్రతిబింబించాయి.  కానీ, ఈ సాంకేతిక విప్లవం రెండు అంచుల కత్తిలా మారింది. సెల్ఫీ, ఫిల్టర్లు, ఫాలోవర్స్ మధ్య జీవితం ఆవేశపూరితమవుతోంది.  పోటీ, పోలికల ఆధారిత సంస్కృతి వారిలో మానసిక ఒత్తిడిని పెంచుతోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఈ తరం యువతలో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది.  కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక మత్తు పదార్థాల వైపు మళ్లుతున్నారు. ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం అమెరికాలో ఇప్పటికే ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుండగా, భారతదేశంలో నగరాల్లోని యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

భారతదేశం - ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా ఈ తరపు ఆశయాల, వ్యసనాల సంక్లిష్ట మిశ్రమాన్ని అనుభవిస్తోంది. 2016లో రిలయన్స్  జియో ద్వారా ప్రారంభమైన డేటా విప్లవం,  స్మార్ట్​ఫోన్ల  చౌక ధర,  సోషల్ మీడియా వృద్ధి వల్ల దేశంలోని సగటు గ్రామ యువకుడికీ ప్రపంచం అరచేతిలో ఒదిగిపోతుంది. కానీ, సమాచారం అందుబాటులోకి రావడమే విజయం కాదు. దానిని ఎలా వినియోగిస్తున్నాం అనేదానిపైనే  భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  ఇక్కడే  సమస్య మొదలవుతుంది. ఒకవైపు ఈ తరం స్టార్టప్, డిజిటల్ మార్కెటింగ్, క్రియేటివ్ ఆర్ట్స్ లో తమ ప్రతిభను చాటుతున్నారు. యూట్యూబ్, షార్ట్ వీడియో ప్లాట్​ఫాంలలో  స్థానిక కళల ప్రదర్శన ద్వారా ఈతరం తమ సంస్కృతిని  ప్రాచుర్యం చేస్తున్న వైనం మనం గమనించవచ్చు. 

పెరుగుతున్న  డ్రగ్స్ వినియోగం

 తక్షణ ఫలితాలు, తక్షణ పేరు ప్రఖ్యాతులకే వారు ఆకర్షితులవుతున్నారు.  దీనివల్ల సంప్రదాయ కుటుంబ సంబంధాలు, విలువలు తారుమారవుతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు బలహీనపడడంతో యువత  ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. పట్టణీకరణ వల్ల ఉత్పన్నమైన ఒత్తిడులు, విద్యా వ్యవస్థలో పోటీ తీవ్రత, నిరుద్యోగం వంటి అంశాలు వారిపై మానసిక స్థితి మరింత భారం పెట్టేవిగా మారుతున్నాయి.  కొవిడ్-19 సమయంలో ఆన్​లైన్ తరగతులు, ఇంటర్నెట్ ఆధారిత జీవనశైలి ఈ తరపు విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపింది. 

మారుమూల గ్రామాల్లో డిజిటల్ విభజన స్పష్టంగా కనిపించింది. మరికొందరు మత్తు పదార్థాల్లో తాత్కాలిక ఉపశమనం వెతుకుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న తీరు అనేకమంది తల్లిదండ్రులను, ప్రభుత్వాలను కలవరపెడుతోంది.  ఈ పరిస్థితుల్లో,  సమాజపరంగా మనం వారికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.  వారి భవిష్యత్తును కేవలం సాంకేతిక నైపుణ్యాలతో తీర్చిదిద్దలేం. విలువలతో కూడిన విద్య, మానసిక ఆరోగ్యంపై  దృష్టి, సాంస్కృతిక అవగాహన ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. విద్యా వ్యవస్థ  కొత్త మార్గాల వైపు దృష్టి మళ్ళించాలి. 

జెన్ - జీ ఒక శక్తిమంతమైన తరం

 మానవీయతకు ప్రాధాన్యం,  సహకార బుద్ధి, సమస్య పరిష్కరణ  నైపుణ్యాలపై దృష్టి పెడుతూ, టెక్నాలజీకి గైడ్ చేసే మానవ ధర్మాన్ని బోధించాలి.  ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కలసి నడవాలి.  డ్రగ్స్ నియంత్రణ కోసం కఠిన చట్టాలతోపాటు, అవగాహన కార్యక్రమాలు గ్రామీణ స్థాయిలో కూడా అవసరం. మానసిక ఆరోగ్య సలహా కేంద్రాలు, ప్రత్యేకంగా విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయాలి. యువత ఎదుర్కొంటున్న ఒత్తిడులను అర్థం చేసుకొని వారిలో భరోసా పెంచే ప్రయత్నాలు చేయాలి. మొత్తానికి జెన్-జీ శక్తిని తక్కువ అంచనా వేయటానికి లేదు.  జెన్ -జీ ఒక శక్తిమంతమైన తరం అనటానికి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం.  వీరి శక్తిని సరైన దిశగా మలిచి, సాంకేతికతను నియంత్రించే జ్ఞానం, సమాజాన్ని గౌరవించే విలువలు అందించలేకపోతే, ఇదే తరం ప్రమాదకరమైన దిశలో మలుపు తిరిగే ప్రమాదం ఉంది. సాంకేతిక యుగంలో పుట్టిన జెన్- జీ ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం,  సోషల్ మీడియా,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాల మధ్య పెరిగింది.

వీరి జీవితాలు వేగం, వాస్తవం, వర్చువల్ ప్రపంచం అనే మూడు అంచుల్లో విస్తరించాయి. సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, మానవ అనుబంధాలు, విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయి. భారతీయ జీవన విధానం ఈ తరానికి సమతుల్య మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.  జెన్ -జీ సాంకేతికతను సాధనంగా, సంస్కృతిని ఆధారంగా చేసుకొని ముందుకు సాగితేనే భారతీయత పరిరక్షితమవుతుంది. నేటి డిజిటల్ యువతలో ఆవిష్కరణ శక్తి ఉన్నప్పటికీ, దానికి మానవీయ దిశ ఇవ్వడం అవసరం. సాంకేతికతలో ఆధునికత, మనసులో భారతీయత, ప్రవర్తనలో మానవత కలిసినప్పుడే జెన్- జీ భారతీయ జీవన విధానాన్ని నూతన రూపంలో ప్రపంచానికి పరిచయం చేసే సత్తా కలిగిన తరమవుతుంది.

‌‌‌‌‌‌‌‌- డా. రావులకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్​సీయూ