ఐయాం సారీ.. ఈ చీమలతో బతకడం నావల్ల కాదు..సంగారెడ్డిలో చీమల భయంతో ఉరేసుకున్న వివాహిత

ఐయాం సారీ.. ఈ చీమలతో  బతకడం నావల్ల కాదు..సంగారెడ్డిలో చీమల భయంతో ఉరేసుకున్న వివాహిత

హైదరాబాద్:  వింత ఫోబియాతో ఓ నిండు మహిళ ప్రాణం తీసుకుంది.  చీమల భయంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.  వాటి వల్ల తాను బతకలేనంటూ సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్ నివశించే మనీషా (25) కొంత కాలంగా చీమల ఫోబియా(మైర్మోకోఫోబియా)తో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. ఈ నెల 4న సాయంత్రం భర్త శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి..బెడ్రూమ్ తలుపు లోపల గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. ఆమె చీరతో ఉరేసుకుని కనిపించింది. మనీషాకు అన్వికా అనే  మూడేళ్ల కూతురు ఉంది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.  అందులో ఏముందంటే.? ఐయాం సారీ.. ఈ చీమలతో బతకడం నా వల్ల కావట్లేదు. అన్వి  జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి హుండీలో రూ.1116 వేయాలని అలాగే ఎల్లమ్మకు వాడు బియ్యం పోయడం మర్చిపోకండి అని రాసిన లేఖ లభ్యం అయ్యింది. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.