ఏటీ సీల పై కార్మిక శాఖ ఫోకస్...ట్రైనింగ్ తీసుకునే వారికి నెలకు రూ.2 వేల స్టైపెండ్

ఏటీ సీల పై కార్మిక శాఖ ఫోకస్...ట్రైనింగ్ తీసుకునే వారికి నెలకు రూ.2 వేల స్టైపెండ్
  •     రూ.1,500 కోట్లు కేటాయించాలని ఫైనాన్స్ కు ప్రపోజల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) అభివృద్ధిపై కార్మిక శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో ఏటీసీలకు రూ.1500 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖకు కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపింది. త్వరలో కార్మిక శాఖ బడ్జెట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ర, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, అధికారులతో ప్రపోజల్స్ పై రివ్యూ చేయనున్నారు. 

ఏటీసీల స్థాపనకు 85 శాతం టాటా టెక్నాలజీస్ సహాకారం అందిస్తుంది. మిగతా 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 65 నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఏటీసీలు ఒపెన్ కాగా, మరి కొన్ని నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. వీటిలో అడ్మిషన్స్ రికార్డ్ స్థాయిలో తొలి సారి 98 శాతం ఫిల్ అయ్యాయి. కాగా రెండో దశలో ప్రభుత్వం 53 నియోజకవర్గాల్లో ఏటీసీలను మంజూరు చేసింది. 

వీటికి ల్యాండ్ గుర్తించటంతో పాటు నిర్మాణ పనులను సీఎం, మంత్రులు శంకుస్థాపనలు చేశారు. వచ్చే ఆర్థిక ఏడాదికి బడ్జెట్ లో కొత్త ఏటీసీలకు నిధులు, ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు నెలకు ఒక్కొక్కరికి రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తామని గతేడాది సెప్టెంబర్ 27న ఏటీసీల ఓపెనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం అన్ని ఏటీసీల్లో 34 వేల మంది నిరుద్యోగ యువత వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటుందని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.