కౌడిపల్లి, వెలుగు: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే అనుకున్నది సాధించవచ్చని గురుకులాల ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్(ఆర్సీవో) రాజేశం తెలిపారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో చదివి గుర్తింపు తేవాలన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో చదివే విద్యార్థులే జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటారన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
తునికి గురుకులం నుంచి చాలా మంది విద్యార్థులు ఐఐటీలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం జేఈఈ మెయిన్స్ లో 91.2 పర్సంటేజీ సాధించిన కన్నెబోయిన విజయ్ కుమార్ ను ఆర్సీవో శాలువాతో సన్మానించారు. మెదక్ కాలేజీ ప్రిన్సిపాల్ రవికుమార్, తునికి ఎంజేపీ ప్రిన్సిపాల్ హరిబాబు పాల్గొన్నారు.
