- మీ భూములకు ఇక డిజిటల్ కవచం
- వివరాలు ఇవ్వకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులే
హుస్నాబాద్, వెలుగు: నీ స్థలం ఎంత? నీ ఇల్లు ఎక్కడి వరకూ? పక్కింటివారితో సరిహద్దు క్లారిటీ ఉందా? ఇక ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానం రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ అర్బన్ ల్యాండ్ రికార్డ్ మిషన్ 'నక్ష' పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 157 మున్సిపాలిటీల్లో తెలంగాణ నుంచి 10 పట్టణాలు చోటు దక్కగా హుస్నాబాద్ వాటిలో ఒకటి. ఇప్పటికే పట్టణాన్ని 100 బ్లాకులుగా విభజించి, 8 వార్డుల వారీగా సర్వే వేగవంతం చేశారు. గతంలో డ్రోన్లు, ఏరియల్ సర్వేలు చేసిన అధికారులు ఇప్పుడు నేరుగా ఇంటింటికీ వెళ్లి కొలతలు తీస్తున్నారు. ఖాళీ స్థలాలు, ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ అంగుళం తప్పకుండా నమోదు చేస్తున్నారు.
డిజిటల్ కార్డు.. అది మీ ఆస్తికి ఆధార్
ఈ సర్వే వల్ల మెయిన్ బెనిఫిట్ 'ల్యాండ్ డిజిటల్ కార్డు'. మీ ఆస్తికి ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తారు. సర్వే తర్వాత ఇచ్చే పత్రం పక్కాగా ఉంటుంది. దీనివల్ల కబ్జాల భయం ఉండదు. సరిహద్దు వివాదాలకు చెక్ పెట్టవచ్చు. ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) కట్టడం నుంచి మ్యుటేషన్ దాకా అంతా ఆన్ లైన్ అయిపోతుంది. డిజిటల్ కార్డు ఉంటే బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి వెనుకాడవు. ఒక్కసారి డేటా నమోదు అయితే భవిష్యత్ లో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
అపోహలు వద్దు.. సహకరించండి
సర్వే టీమ్స్ ఇంటికి వస్తే కొందరు ప్రజలు కంగారు పడుతున్నారు. పన్నులు పెంచుతారేమోనని, ఖాళీ స్థలాలు ప్రభుత్వం తీసుకుంటుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆస్తుల భద్రత కోసమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొంతమంది ఖాళీ స్థలాల వివరాలు చెప్పకుండా దాచిపెడుతున్నారని సమాచారం.
ఇది భవిష్యత్‌లో వారికే నష్టం కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మార్చి నాటికి టార్గెట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల సహకారం లేకపోతే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
డిజిటల్ మ్యాపింగ్‌కు అందరూ సహకరించాలి
'నక్ష' సర్వేలో ప్రజలు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కోరారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు భూమి పత్రాలు చూపించి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆస్తుల భద్రత, పారదర్శకతకు ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ప్రతీ వార్డులో పట్టణ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
