- డెట్ ఫండ్స్‌కు పెరిగిన డిమాండ్
- ఈక్విటీ స్కీమ్‌లకు తగ్గిన ఆదరణ
- రూ.81.92 లక్షల కోట్లకు చేరిన ఇండస్ట్రీ ఏయూఎం
- వరుసగా రెండో నెలలోనూ రూ.31 వేల కోట్ల పైనే సిప్‌లు
ముంబై: ఇరాన్–అమెరికా యుద్ధం కొనసాగుతున్నా, చమురు ధరలు భారీగా పెరిగినా, ఇండియాలో ఇన్వెస్టర్లు మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌ను విడిచి పెట్టడం లేదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ల ద్వారా స్టాక్, డెట్ మార్కెట్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ (అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్–ఏయూఎం) రికార్డు స్థాయిలో రూ.81.92 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చిలోని రూ.73.73 లక్షల కోట్ల నుంచి 11.2 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్‌లో రూ.3.22 లక్షల కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఇదే నెలలో 11 కొత్త ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌ఓలు) ప్రారంభమై, రూ.828 కోట్లను
సేకరించాయి.
- మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ప్రకారం..
1) ఈక్విటీ ఫండ్స్‌కు రూ.38,440 కోట్లు
ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.38,440 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వరుసగా 62 వ నెలలోనూ ఈ విభాగంలోకి పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే, మార్చి నెలలో వచ్చిన రూ.40,450 కోట్లతో పోలిస్తే ఈసారి 5 శాతం తగ్గాయి. ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్‌లో అత్యధికంగా రూ.10,148 కోట్ల పెట్టుబడులు రాగా, స్మాల్-క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నెల ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ.6,886 కోట్లకు చేరున్నాయి. మిడ్-క్యాప్ ఫండ్స్‌కు రూ.6,551 కోట్లు లభించాయి.
2) డెట్ ఫండ్స్‌లో రికార్డ్ ఇన్‌ఫ్లో
కిందటి నెలలో మ్యూచువల్ ఫండ్స్ వృద్ధిలో డెట్ ఫండ్స్ కీలకంగా మారాయి. ఈ విభాగంలోకి ఏకంగా రూ.2.47 లక్షల కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ ఏయూఎం మార్చిలోని రూ.16.52 లక్షల కోట్ల నుంచి 15.9 శాతం పెరిగి రూ.19.14 లక్షల కోట్లకు చేరింది. లిక్విడ్ ఫండ్స్‌లో అత్యధికంగా రూ.1.65 లక్షల కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లో రూ.31,420 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లో రూ.20,643 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
3) గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మార్చి కంటే 34 శాతం పెరిగి రూ.3,040 కోట్లకు చేరుకున్నాయి. వెండి ఈటీఎఫ్‌ల నుంచి రూ.126.72 కోట్ల మేర నిధులు వెనక్కి వెళ్లాయి. అయినప్పటికీ, వీటి ఏయూఎం 2.7 శాతం పెరిగి రూ.81,944 కోట్లకు చేరింది.
4) సిప్ పెట్టుబడులు
సిప్‌ల ద్వారా వచ్చే పెట్టుబడులు వరుసగా రెండో నెలలోనూ రూ.31 వేల కోట్ల మార్కు కంటే పైనే నమోదయ్యాయి. ఏప్రిల్‌లో సిప్ ద్వారా రూ.31,115 కోట్లు వచ్చాయి. ఇది మార్చి నెలతో (రూ.32,087 కోట్లు) పోలిస్తే 3 శాతం తక్కువ. మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులలో సిప్ ఆస్తుల వాటా 20.6 శాతంగా (రూ.16.85 లక్షల కోట్లుగా) ఉంది.
