రూ.26 లక్షల కోట్లకు.. ఆన్​లైన్​ రిటెయిల్​ మార్కెట్

రూ.26 లక్షల కోట్లకు.. ఆన్​లైన్​ రిటెయిల్​ మార్కెట్
  • 2030 నాటికి చేరుతుందని డెలాయిట్​ అంచనా
  • 2022 లో 70 బిలియన్​ డాలర్లు

న్యూఢిల్లీ: దేశంలోని టైర్​2, టైర్​3 సిటీలలో వస్తున్న వేగమైన గ్రోత్​ కారణంగా మన ఆన్​లైన్​ రిటెయిల్​ మార్కెట్​ 2030 నాటికి 325 బిలియన్​ డాలర్లకు (దాదాపు రూ.26 లక్షల కోట్లు) చేరుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది. 2022 లో ఆన్​లైన్​ రిటెయిల్​ మార్కెట్​ సైజు 70 బిలియన్​ డాలర్లని డెలాయిట్​ ఇండియా ఈ రిపోర్టులో పేర్కొంది. రాబోయే పదేళ్ల కాలంలో ఆఫ్​లైన్​ రిటెయిల్​తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ (2.5 రెట్లు) వేగంతో ఆన్​లైన్​ రిటెయిల్​ మార్కెట్​ ఎదుగుతుందని అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే మూడో పెద్ద కన్జూమర్​ మార్కెట్​గా ఇండియా శరవేగంతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఫ్యూచర్​ ఆఫ్​ రిటెయిల్​ పేరుతో ఒక రిపోర్టును డెలాయిట్​ తీసుకొచ్చింది.

ఆన్​లైన్​ ఆర్డర్ల సంఖ్యలో టైర్​2, టైర్​ 3 సిటీలు ఇప్పటికే టైర్​1 సిటీలను దాటేశాయి. రాబోయే పదేళ్లలో ఈ జోరు మరింత ఎక్కువవుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్​లైన్​ రిటెయిల్​ బిజినెస్​ 325 బిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్​ వివరించింది. 2022 లో టైర్​2, టైర్​ 3 సిటీల నుంచి ఆర్డర్లు మొత్తం ఆర్డర్లలో 60 శాతానికి చేరాయి. మొత్తం ఆర్డర్ల వాల్యూమ్​ ఆ ఏడాదిలో టైర్​3 సిటీల వాటా 65 శాతం పెరిగితే, టైర్​2 సిటీల ఆర్డర్ల వాల్యూమ్​  50 శాతం పెరిగినట్లు డెలాయిట్​ రిపోర్టు తెలిపింది.

ఆన్​లైన్ ​జోరెందుకు...

ఆన్​లైన్​ రిటెయిల్​ దేశంలో వేగంగా ఎదగడానికి చాలా కారణాలనున్నాయని డెలాయిట్​ ఈ రిపోర్టులో వెల్లడించింది. ఆర్డర్లు ఇవ్వడంతోపాటు, రిటర్న్​లలోనూ  సులభత్వం, లాజిస్టిక్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ బాగా మెరుగయి 19 వేల పిన్​కోడ్స్​కు చేరుకోగలగడం వంటివి ప్రధానమైనవని వివరించింది. దేశంలో డిజిటల్​ ఇష్టపడే కన్జూమర్ల సంఖ్య ఎక్కువవుతోందని, 220 మిలియన్​ల మంది ఆన్​లైన్​ షాపర్లు ఉన్నారని చెబుతూ, దీంతో ఈ–కామర్స్​ (ఆన్​లైన్​ బిజినెస్​) మరింత ఊపందుకుంటోందని తెలిపింది.

ఏఆర్​, వీఆర్​లతో  మారుతున్న కస్టమర్​ ఎక్స్​పీరియన్స్​..

టైర్​ 2 సిటీలలో ఇంటర్నెట్​ దూసుకెళ్తుండటంతో పాటు, ఆన్​లైన్​ బిజినెస్​ల ఏర్పాటు ఈజీ కావడం, ప్రభుత్వ సపోర్టు, కన్వీనియెన్స్​, కావాల్సిన వస్తువులను ఈజీగా కనుక్కోవడానికి వీలు, పేమెంట్స్​సులభమవడం ....ఈ అంశాలన్నీ కలిసి దేశంలోని రిటెయిల్​ ల్యాండ్​స్కేప్​నే మార్చి వేయనున్నాయని డెలాయిట్​ ఈ రిపోర్టులో వివరించింది. ఆగ్మెంటెడ్​ రియాల్టీ (ఏఆర్​), వర్చువల్​ రియాల్టీ (వీఆర్​) , మెటావర్స్​ వంటి కొత్త టెక్నాలజీలతో కస్టమర్​​ ఎక్స్​పీరియన్స్​లో పెను మార్పులు వస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది.  పెద్ద రిటెయిల్​ ఎకో సిస్టమ్​లో భాగం కిరాణా షాపులను ఇంటిగ్రేట్​ చేస్తే కొత్త మార్కెట్లకు ఛాన్స్​ వస్తుందని, ప్రొడక్ట్​ రేంజ్​ పెంచుకోవడంతోపాటు, తమ బిజినెస్​ను పెంచుకునే అవకాశం పెద్ద కంపెనీలకు కలుగుతుందని తెలిపింది.

ప్రైవేట్​ ఈక్విటీ పెట్టుబడులూ....

ఆన్​లైన్​ రిటెయిల్​ బిజినెస్​లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్​ క్యాపిటల్​ సంస్థల పెట్టుబడులు సైతం బాగా పెరుగుతున్నాయి. గత అయిదేళ్లలో చూస్తే ఈ పెట్టుబడులు 23 బిలియన్​ డాలర్లకు చేరాయని డెలాయిట్​ రిపోర్టు చెబుతోంది. ఆర్గనైజ్డ్​ రిటెయిల్​సెగ్మెంట్​ను త్వరలోనే ఆన్​లైన్​ రిటెయిల్​ దాటేస్తుందని పేర్కొంటూ, పెద్ద కంపెనీలన్నీ తమ ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ బిజినెస్​లను ఇంటిగ్రేట్​ చేసుకోవల్సి వస్తుందని వివరించింది. అప్పుడే కన్జూమర్లకు మెరుగైన సేవలను అందించగలుగుతాయని తెలిపింది.

ఇండియాలో రిటెయిల్​ సెక్టార్​ ఎదుగుదల చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. మిడిల్​ క్లాస్​ సంఖ్యా ఎక్కువవుతోంది. డిజిటైజేషన్​ చాలా వేగంగా సాగుతోంది. టెక్నాలజీ పవర్​ను సరిగ్గా వాడుకోవడం వల్ల నిలకడయిన వ్యూహాలతో ఒక ఎకోసిస్టమ్​ను ఏర్పాటు చేసుకునే అవకాశం రిటెయిలర్లకు కలుగుతోంది. కన్జూమర్ల డిమాండ్స్​ నెరవేర్చడంతోపాటు, కొత్త బెంచ్​మార్కులను సాధించడానికీ   ఎకో సిస్టమ్​ వీలు కల్పిస్తుంది.

- ఆనంద్​ రామనాథన్​, పార్ట్​నర్​, డెలాయిట్​ ఇండియా