తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని TVK సృష్టిస్తున్న సునామీ వెనుక కేవలం 'దళపతి' ఇమేజ్ మాత్రమే లేదు. అనుభవజ్ఞులైన రాజకీయ వ్యూహకర్తల మేధస్సు, పక్కా ప్రణాళికాబద్ధమైన క్షేత్రస్థాయి ఆపరేషన్ కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్‌లో టీవీకే భారీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. విజయ్ కోసం తెరవెనుక చక్రం తిప్పిన ఆ ముగ్గురు వ్యూహకర్తల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ప్రశాంత్ కిషోర్: ది మాస్టర్ మైండ్
భారత రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్.. విజయ్ పార్టీకి స్పెషల్ అడ్వైజర్ గా వ్యవహరించారు. 2025 ప్రారంభం నుంచే విజయ్‌తో టచ్‌లో ఉన్న పీకే.. 2026 ఎన్నికల కోసం ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేల వారసత్వ, అవినీతి రాజకీయాలను టార్గెట్ చేస్తూ.. మార్పు కోరుకునే యువతను టీవీకే వైపు మళ్లించడంలో పీకే వ్యూహం ఫలించింది. కేవలం గ్లామర్ మీద ఆధారపడకుండా.. పార్టీని ఒక సామాజిక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక వ్యూహాలు రచించారు.
ఆదవ్ అర్జున్: ప్రచార సారథి
టీవీకే జనరల్ సెక్రటరీగా ఉన్న ఆదవ్ అర్జున్, పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. గతంలో వీసీకే నేతగా ఉన్న అనుభవంతో.. తమిళనాడులోని క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలను ఆయన విజయ్‌కు అనుకూలంగా మార్చగలిగారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ వర్గాల ఓట్లు కీలకం? అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలి? అనే అంశాల్లో ఆదవ్ అర్జున్ రచించిన వ్యూహాలు ఇప్పుడు టీవీకేను మ్యాజిక్ ఫిగర్ వైపు నడిపిస్తున్నాయి.
జాన్ ఆరోగ్యసామి:
పొలిటికల్ కన్సల్టెంట్‌గా పేరున్న జాన్ ఆరోగ్యసామి.. టీవీకే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కేడర్‌ను నిర్మించడం, బూత్ లెవల్ కమిటీలను బలోపేతం చేయడంలో కృషి మరువలేనిది. విజయ్ ఇమేజ్ను ఓట్ల రూపంలోకి మార్చడానికి అవసరమైన వ్యవస్థను జాన్ రూపొందించారు.
వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడుతామని ప్రచారం చేసిన టీవీకే.. ప్రస్తుతం డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి ముందంజలో ఉంది. ముఖ్యంగా అధికార డీఎంకే కంచుకోటలను బద్దలు కొట్టడంలో ఈ వ్యూహకర్తల త్రయం సక్సెస్ అయ్యింది. విజయ్ చరిష్మాకు వ్యూహాలు తోడవడంతో తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే.. తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడి విజయ్ 'విజయ' కేతనం ఎగరవేయడం ఖాయం.
