డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే: హీరో విజయ్ నమ్మకాన్ని నిజం చేసిన శబరినాథన్!

డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే:  హీరో విజయ్ నమ్మకాన్ని నిజం చేసిన శబరినాథన్!

తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్యుడు అసాధారణ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. దళపతి విజయ్ సొంత డ్రైవర్ కొడుకు శబరినాథన్, విరుగంబాక్కం నియోజకవర్గంలో అధికార పార్టీ డీఎంకే అభ్యర్థిని ఓడించి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

ఎవరీ శబరినాథన్?
30 ఏళ్ల శబరినాథన్ తండ్రి రాజేంద్రన్, చాలా ఏళ్లుగా విజయ్ దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఆయన నమ్మకానికి మెచ్చిన విజయ్, ఆయన్ని తన పర్సనల్ అసిస్టెంట్‌గా ప్రమోట్ చేశారు. ఇప్పుడు అదే నమ్మకంతో రాజేంద్రన్ కొడుకు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయాల్లోకి తెచ్చారు.

ఎమోషనల్ మూమెంట్.. వైరల్ వీడియో
విజయ్ తనకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పుడు శబరినాథన్, అతని తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. శబరినాథన్ ఏడుస్తూ విజయ్ కాళ్లపై పడగా, విజయ్ అతన్ని ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ప్రస్తుత ఓట్ల లెక్కింపు  ప్రకారం శబరినాథన్ (TVK) 14  వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా... ఆయనకు 43,474 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాకు 29,041 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే గెలిచింది, కానీ ఈసారి విజయ్ 'అండర్ డాగ్' వ్యూహం ఫలించింది.

నేచురల్ స్టార్ నాని స్పందన
ఈ అద్భుత విజయంపై మన తెలుగు హీరో నాని కూడా స్పందించారు. ట్విట్టర్ (X) లో "ఒక సామాన్యుడు విజయం సాధించడం అనేది ఎప్పుడూ ఒక గొప్ప సినిమా చూసినట్టే ఉంటుంది. ఇది మొదట మా ఇంట్లో (సినిమాల్లో) జరిగింది, ఇప్పుడు పక్కింట్లో (రాజకీయాల్లో) జరుగుతోంది. తమిళనాడు ప్రజలు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది." అంటూ పోస్ట్ చేసారు.

డ్రైవర్ కొడుకుగా గుర్తింపు ఉన్న శబరినాథన్, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఎదగడం చూస్తుంటే విజయ్ రాజకీయాల్లో ఎంతటి మార్పు తీసుకురావాలని అనుకుంటున్నారో అర్థమవుతోంది. ఇది కదా అసలైన పొలిటికల్ థ్రిల్లర్!