తమిళనాట సంచలనం.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్టాలిన్ !

తమిళనాట సంచలనం.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్టాలిన్ !

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు జీవితంలో మర్చిపోలేని ఘోర పరాభవం ఎదురైంది. 2026లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం మాత్రమే కాదు సిట్టింగ్ సీటును కూడా స్టాలిన్ కోల్పోయారు. చెన్నై పరిధిలోని కొలత్తూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన స్టాలిన్.. విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 

కొలత్తూరు నియోజకవర్గం కౌంటింగ్ మొత్తం 22 రౌండ్లలో జరుగుతుంది. 9 వేల 122 ఓట్ల తేడాతో టీవీకే పార్టీ అభ్యర్థి స్టాలిన్ను ఓడించారు. 1996 నుంచి స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన స్టాలిన్ ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం డీఎంకే శ్రేణులను మరింత కుంగదీసింది.

డీఎంకే పార్టీ చరిత్రలోనే మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితిని చవిచూడలేదు. ఉత్తర చెన్నైలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొలత్తూరు ఒకటి. ఈ నియోజకవర్గం అధికార డీఎంకేకు నిన్నమొన్నటి దాకా కంచుకోటగా ఉంది. డీఎంకే అధ్యక్షుడిగా కూడా ఉన్న స్టాలిన్, 2011 నుంచి ఈ సీటులో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.

►ALSO READ | ఎవరీ శ్రీనాథ్? నటుడి నుంచి ఎమ్మెల్యే వరకు.. విజయ్‌తో 34 ఏళ్ల బంధం!

2021 ఎన్నికలలో, ఆయన ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారామ్‌ను 70 వేల 384 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ కీలకమైన స్థానంలో ఓటింగ్ శాతం 2021లో 61.68 శాతం కాగా.. 2026లో 86.12 శాతానికి గణనీయంగా పెరిగింది. ఇంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడే విజయ్ టీవీకే పార్టీకి ఈ నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీచాయని స్పష్టమైంది.