IPL 2026: పంజాబ్ పరువు కాపాడిన 23 ఏళ్ల కుర్రాడు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

IPL 2026: పంజాబ్ పరువు కాపాడిన 23 ఏళ్ల కుర్రాడు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

గాంధీనగర్: ఐపీఎల్ 19లో భాగంగా గుజరాత్‎తో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో పంజాబ్ కింగ్స్ తడబడింది. సొంతగడ్డపై గుజరాత్ బౌలర్లు రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగుల మోస్తారు స్కోర్ చేసింది. 23 ఏళ్ల కుర్రాడు సూర్యాంశ్ షెడ్జ్ (57), స్టోయినిస్ (40) పంజాబ్‎ను ఆదుకున్నారు. జాసన్ హోల్డర్ నాలుగు వికెట్లతో పంజాబ్ నడ్డి విరిచాడు. రబాడ, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. 

 గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన పంజాబ్‎ బ్యాటర్లు పెవిలియన్‎కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లలోనే ఇన్‎ఫామ్ బ్యాటర్స్ ప్రియాన్ష్ ఆర్య (2), కూపర్ కన్నోలి (0) వికెట్లు తీసి మహ్మద్ సిరాజ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. ప్రభ్‎సిమ్రాన్ (15), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో పంజాబ్ 40 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

 ఈ దశలో జతకట్టిన యంగ్ ప్లేయర్ సూర్యాంశ్ షెడ్జ్ (57), స్టోయినిస్ (40) ఆరో వికెట్‎కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పంజాబ్‎ను ఆదుకున్నారు. ముఖ్యంగా సూర్యాంశ్ షెడ్జ్ భారీ షాట్లతో అలరించాడు. మానవ్ సుతార్ వేసిన 14వ ఓవర్లో మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది 24 పరుగులు పిండుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో సూర్యాంశ్ షెడ్జ్, స్టోయినిస్ ఔట్ అయ్యారు. చివర్లో మార్కో జాన్సెన్ (20) రాణిచండంతో పంజాబ్ 160 రన్స్ మార్క్ అందుకుంది. అనంతరం గుజరాత్ 164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగింది.