సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నూతన కమిటీని ప్రకటించింది. పరిశ్రమలోని హేమాహేమీలతో కూడిన ఈ బోర్డు నియామకం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త సారథులు..
సంస్థకు సరికొత్త జవసత్వాలు అందించేందుకు, భవిష్యత్తు ప్రణాళికలను ముందుండి నడిపించేందుకు చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి. భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఇక ఈ బోర్డుకు మరింత క్రేజ్ తీసుకువస్తూ, మాస్ డైరెక్టర్ చిక్కాల మెహర్ రమేష్ కుమార్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్‌లతో పాటు సినీ, మీడియా, నాటక రంగాలకు చెందిన మరో 14 మంది సెలబ్రిటీలను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఒక టీమ్‌ను సెట్ చేసింది.
డైరెక్టర్లు వీరే..
కమిటీలో చోటు దక్కించుకున్న ఆ14 మంది డైరెక్టర్ల లిస్ట్ లేటెస్ట్ గా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వారిలో సీనియర్ నటుడు సుమన్ తల్వార్, విలక్షణ నటుడు ఎస్. శివాజీ, నటి వై. ఝాన్సీ. క్లాసిక్ చిత్రాల దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, మాస్ డైరెక్టర్ వి. సముద్ర, స్టార్ డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్. ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద స్థానం కల్పించారు. అంతే కాకుండా సీనియర్ జర్నలిస్ట్ కే. ఉమామహేశ్వర రావు, రిటైర్డ్ అధ్యాపకుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, కళాకారులు మీర్.ఎస్, ఏ. సత్యనారాయణ, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలను నియమించింది.
టార్గెట్.. నంది అవార్డులు
గత కొంతకాలంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక 'నంది అవార్డులు', 'నంది నాటకోత్సవాల'కు మళ్లీ జీవం పోయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం కానుంది. ఏపీలో సినిమా, టీవీ షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు, స్థానిక థియేటర్ల సమస్యల పరిష్కారం, నిర్వీర్యమవుతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ టీమ్ రూట్‌మ్యాప్ సిద్ధం చేయనుంది. ఏపీలో సినీ, కళా రంగాన్ని అభివృద్ధి ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ నూతన కమిటీ టాలీవుడ్‌కు, ఏపీ ఆర్టిస్టులకు సరికొత్త ఆశలను, అవకాశాలను మోసుకొస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి.
