- సూపర్ సేవర్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన అధికారులు
హైదరాబాద్ వెలుగు: సిటీ స్టూడెంట్లకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ పేరుతో మెట్రో స్టూడెంట్ పాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టూడెంట్ పాస్ స్పెషల్ ఆఫర్ కింద 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి అన్ని ఫెయిర్ జోన్లలో 30 ట్రిప్పులు జర్నీ చేయొచ్చని మెట్రో రైల్ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మెట్రో స్టూడెంట్ పాస్ పొందండిలా..
1 ఏప్రిల్ 1998 తర్వాత పుట్టిన వారికి మాత్రమే మెట్రో స్టూడెంట్ పొందేందుకు అర్హులని అధికారులు తెలిపారు. ఈ పాస్ కోసం స్టూడెంట్లు తప్పనిసరిగా మెట్రో ప్రత్యేక స్మార్ట్ కార్డ్ లను కొనాల్సి ఉంటుందన్నారు. ఒక్కో స్టూడెంట్ కు ఒక స్మార్ట్ కార్డు మాత్రమే జారీ చేస్తామన్నారు. ఈ ఆఫర్ 1 జులై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు 9 నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు. మెట్రో పాస్ కోసం స్టూడెంట్లు హైదరాబాద్ మెట్రో రైల్ వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.
అందులో వివరాలు నింపి వారు చదువుతున్న స్కూల్ లేదా కాలేజీ ఐడీ కార్డు జిరాక్స్,ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు, ప్రిన్సిపల్ సంతకంతో ఉన్న బొనఫైడ్ సర్టిఫికెట్ ను జత పరచాల్సి ఉంటుందన్నారు. స్టూడెంట్లు ఈ అప్లికేషన్ ఫామ్ ను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేఎన్టీయూ స్టేషన్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, విక్టోరియా మెమోరియల్, దిల్ సుఖ్ నగర్, నారాయణగూడ, బేగంపేట, పరేడ్ గ్రౌండ్, నాగోల్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లలో ఎక్కడైనా సబ్మిట్ చేసి పాస్ ను కొనుగోలు చేయొచ్చని అధికారులు తెలిపారు.
