ఒరాకిల్ అమెరికా ఆఫీసులో లే ఆఫ్స్ : 700 మంది ఉద్యోగులకు డెడ్ లైన్

ఒరాకిల్ అమెరికా ఆఫీసులో లే ఆఫ్స్ : 700 మంది ఉద్యోగులకు డెడ్ లైన్

టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ఉద్యోగుల లేఆఫ్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం భారీగా నిధులు అవసరం కావడంతో సంస్థ ఏకంగా 30వేల మంది ఉద్యోగులను కొద్ది రోజుల కిందటే ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. ఈ మెగా లేఆఫ్స్‌లో భాగంగా కాలిఫోర్నియాలో సుమారు 700 మందిపై వేటు పడనుంది. రెడ్‌వుడ్ సిటీ, శాంటా క్లారా, ప్లెసెంటన్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని ఐటీ నిపుణులు జూన్ 1 నాటికి తమ డెస్కులను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ ఆఫీసుల్లోనూ ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉద్యోగులకు పంపిన లేఆఫ్ మెయిల్స్ వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తెల్లవారుజామున 6 గంటలకే వచ్చిన "ఈరోజే మీ చివరి పనిదినం" అనే మెయిల్ చూసి చాలా మంది షేకే పోయారు. సియాటిల్ కార్యాలయంలో పనిచేసే దాదాపు 491 మంది రిమోట్ ఉద్యోగులు కూడా ఈ కోతకు గురయ్యారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ పేర్కొంది. తొలగించిన వారికి సర్వీస్ రూల్స్ ప్రకారం సెవెరెన్స్ ప్యాకేజీ అందజేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

ALSO READ : అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో అల్లకల్లోలం..

ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణలో భాగంగానే లారీ ఎల్లిసన్ నేతృత్వంలోని ఒరాకిల్ ఈ సాహసోపేతమైన అడుగు వేసిందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ పేర్కొంది. అవసరమైతే కొన్ని ఆస్తులను అమ్మేందుకు కూడా కంపెనీ వెనకాడటం లేదు. గతేడాది మే నెల నాటికి లక్షా 62వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులున్న ఈ సంస్థలో.. ప్రస్తుత కోత టెక్ రంగంలో గత 12 నెలల్లోనే అతిపెద్దదిగా నమోదైంది. కేవలం ఒరాకిల్ మాత్రమే కాదు.. మెటా వంటి ఇతర దిగ్గజాలు కూడా ఏఐ ఖర్చుల కోసం ఉద్యోగాల కోతను ఆశ్రయిస్తున్నాయి.

ALSO READ : ఆరు వారాల నష్టాలకు బ్రేక్..

టెక్ ప్రపంచంలో ఏఐ రాకతో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 70కి పైగా కంపెనీలు సుమారు 40వేల 480 మందిని తొలగించాయి. టెక్ కంపెనీలు తమ వనరులను మనుషుల నుంచి మెషీన్ లెర్నింగ్, ఏఐ వైపు మళ్లిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ నిపుణులు భవిష్యత్తుపై భయపడుతున్నారు. ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఇతర టెక్ సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.