ఆరు వారాల నష్టాలకు బ్రేక్.. వారాంతంలో లాభాల్లో క్లోజ్ అయిన మన స్టాక్ మార్కెట్

ఆరు వారాల నష్టాలకు బ్రేక్.. వారాంతంలో లాభాల్లో క్లోజ్ అయిన మన స్టాక్ మార్కెట్

గత 6 వారాలుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఈ వారాంతంలో అద్భుతమైన రికవరీని సాధించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 919 పాయింట్లు లాభపడి 77,550 స్థాయికి చేరగా, నిఫ్టీ 24,000 మార్కును అధిగమించి స్థిరపడింది. ఈ వారంలో రెండు సూచీలు దాదాపు 5.5 శాతం మేర లాభపడి ఇన్వెస్టర్ల నష్టాలను పూడ్చాయి.

ALSO READ : ఈ హోటల్ లోనే అమెరికా, ఇరాన్ చర్చలు

మార్కెట్ పరుగుకు ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో ర్యాలీ అండగా నిలిచింది. ప్రైవేట్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు దాదాపు 1.5 శాతం నుండి 1.8 శాతం వరకు లాభపడటంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కళకళలాడింది. అయితే మరోవైపు ఐటీ రంగం మాత్రం ఒత్తిడికి లోనైంది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్చి త్రైమాసిక ఫలితాల్లో లాభం 12.2 శాతం పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్ల అనిశ్చితిపై వెలువడిన ఆందోళనల కారణంగా ఈ షేరు 2 శాతం పడిపోయింది. ఇది ఐటీ ఇండెక్స్‌ను 1.5 శాతం మేర కిందికి లాగింది.

అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికాలోని ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ సూచీలు రాణించడం భారత మార్కెట్లకు కలిసొచ్చింది. అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల సానుకూల వార్తలతో నాస్డాక్ దూసుకుపోవడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. దీనికి తోడు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 10 పైసలు పుంజుకుని 92.41 వద్ద నిలవడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది.

ALSO READ : యుద్ధంలో తెలివిగా మారిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు

రాబోయే రోజుల్లో మార్కెట్ గమనం ప్రధానంగా శనివారం జరగనున్న అమెరికా-ఇరాన్ చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈ చర్చలు సఫలమై ఉద్రిక్తతలు తగ్గితే ముడి చమురు ధరలు అదుపులోకి వచ్చి, భారత మార్కెట్లు మరింతగా పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మొత్తం మీద నెలన్నర నష్టాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం రిటైల్ ఇన్వెస్టర్లకు ఊపిరి పీల్చుకుంటున్నారు.