యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. దీంతో ఇరాన్ లోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన కూలిన భవనాలు, మట్టి, బూడిద, సర్వనాశనం అయిన బ్రిడ్జిలు దర్శనం ఇస్తున్నాయి. ఈ దాడుల వల్ల సుమారు లక్షా 25వేల 630 పౌర నివాస ప్రాంతాలు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA వెల్లడించింది. కేవలం రాజధాని టెహ్రాన్ పరిధిలోనే దాదాపు 39వేలకు పైగా నివాస, వాణిజ్య భవనాలు శిథిలాలయ్యాయి. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా.. సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై కూడా తీవ్ర ప్రభావం చూపడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
వాణిజ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ దాడుల్లో దాదాపు 23వేల 500 వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మట్టిలో కలిశాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక దెబ్బతిన్నట్లయింది. ముఖ్యంగా ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్లు, కీలకమైన సరిహద్దు ప్రాంతాలు, పారిశ్రామిక జోన్లపై క్షిపణులు వర్షం కురిపించడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రధాన నగరాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కుప్పకూలడంతో వేలాది మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు. యుద్ధం కారణంగా సప్లై చైన్ పూర్తిగా తెగిపోవటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ALSO READ: ఈ హోటల్ లోనే అమెరికా, ఇరాన్ చర్చలు
అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. మానవతా దృక్పథంతో పనిచేయాల్సిన వైద్య రంగం కూడా ఈ దాడుల నుంచి తప్పించుకోలేకపోయింది. మొత్తం 339 ఆసుపత్రులు, అత్యవసర విభాగాల నుంచి మందుల దుకాణాల వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెడ్ క్రెసెంట్ సంస్థకు చెందిన 20 కేంద్రాలు, డజన్ల కొద్దీ అంబులెన్సులు ధ్వంసం కావడంతో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందడం కష్టతరంగా మారింది ఇరాన్ దేశంలో. గర్భిణీలు, చిన్నపిల్లలతో సహా వందలాది మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వైద్య సిబ్బంది కూడా యుద్ధ భూమిలో అమరులయ్యారు.
ALSO READ : ఆరు వారాల నష్టాలకు బ్రేక్..
విద్య, సాంస్కృతిక రంగాలపై కూడా ఈ యుద్ధం గట్టి దెబ్బే కొట్టింది. దాదాపు 760కి పైగా పాఠశాలలు, 50కి పైగా గ్రంథాలయాలు, అనేక విశ్వవిద్యాలయ భవనాలు బాంబు దాడులకు గురయ్యాయి. విద్యా సంస్థలు మూతపడటంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న సాంస్కృతిక కట్టడాలు కూడా ధ్వంసమయ్యాయని ఇరాన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 8 నుంచి రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. స్మశానంలా మారిన ఇరాన్ నగరాలకు జరిగిన అపారమైన నష్టం నుంచి ఆ దేశం కోలుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
