ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తన అపురూపమైన కళ్లతో, సహజసిద్ధమైన అందంతో మోనాలిసా భోంస్లే ఓ రాత్రిలో వైరల్ సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. గత నెల మార్చిలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకుని మరో సారి సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఆమె వయసుపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) వెల్లడించిన నిజాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
మైనర్‌గా తేలిన మోనాలిసా..
గత నెల మార్చి 11న కేరళలోని పూవార్‌లో ఉన్న శ్రీ నయనార్ దేవాలయంలో మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లి సమయంలో ఆమె మైనర్ అని, కేవలం 16 ఏళ్లు మాత్రమేనని ఆరోపణలు రావడంతో NCST లోతుగా విచారణ చేపట్టింది. ఇండోర్‌లోని మహేశ్వర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రికార్డుల ప్రకారం, మోనాలిసా డిసెంబర్ 30, 2009న జన్మించింది. అంటే పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని కమిషన్ నిర్ధారించింది.
ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదు..
మోనాలిసా మైనర్ అని తేలడంతో, ఆమెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు అతనిపై పోక్సో చట్టం , కిడ్నాప్ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం వాడిన బర్త్ సర్టిఫికేట్ నకిలీదని విచారణలో తేలింది. దీంతో ఆ వివాహ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కమిషన్ కోర్టును కోరింది.
ALSO READ : ‘జన నాయగన్’ లీక్‌పై చిరంజీవి ఆగ్రహం..
ఒక్కసారిగా మారిన జాతకం..
2025 మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా, తన నీలి రంగు కళ్లతో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ పాపులారిటీతోనే ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. పి.బిను వర్గీస్ దర్శకత్వంలో ‘నాగమ్మ’ అనే మలయాళ చిత్రంలో నటించింది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ALSO READ : బన్నీ- అట్లీ 'రాకా' మూవీ రెమ్యునరేషన్ల షాక్..
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ కోసం మోనాలిసా తన తండ్రి జై సింగ్ భోంస్లేను ఎదిరించి ఇంటి నుండి బయటకు వచ్చింది. కానీ, చట్ట ప్రకారం ఆమె వయసు సరిపోకపోవడంతో ఇప్పుడు ఈ ప్రేమ కథ వివాదాల్లో చిక్కుకుంది. ఇండోర్ ఐజీ అనురాగ్ నేతృత్వంలో ఈ కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోంది. ఒక మైనర్ బాలికను ఇలా పెళ్లి చేసుకోవడంపై విశ్వహిందూ పరిషత్ (VHP) వంటి సంస్థలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఏది ఏమైనా, కుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ‘మాయా కళ్ళ’ సుందరి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
