సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడాలో న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
భారీగా మంటలు ఎగసిపడుతున్న క్రమంలో ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల జనం భయబ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల్లో ఉన్న కార్మికులు విషయం తెలుసుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
►ALSO READ | IPL 2026: రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ మధ్య కీలక పోరు.. ఎవరు గెలుస్తారో తెలుసా!
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతూ దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు ఫైర్ సిబ్బంది.
సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు పేలడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో వేగంగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
