కష్టపడకుండానే, ఏ పని చేయకుండానే సంపాదించాలనే ధోరణితో కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. కొందరు పెట్టుబడుల పేరుతో, ఆన్ లైన్ బెట్టింగ్ పేరుతో మోసం చేస్తుంటే.. ఈ కేటుగాడు లక్ష 5 లక్షలు ఇస్తానని చెప్పి సామాన్యులను మోసం చేస్తున్నాడు. నల్లగొండ జిల్లాలో నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం (ఏప్రిల్ 09) పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నకిలీ కరెన్సీ తో మోసం చేసిన నిందితుడిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను టార్గెట్ చేసి నకిలీ 500 నోట్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని నేరాలు పాల్పడుతున్నట్లు తెలిపారు. 1 లక్ష రూపాయల అసలు కరెన్సీకి 5 లక్షల నోట్ల ఆఫర్ పేరుతో మోసం చేసినట్లు చెప్పారు.
నల్ల కాగితాన్ని కెమికల్‌తో అసలు నోట్లలా చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. నోట్ల కట్టలలో పైభాగంలో ఒరిజినల్ నోట్లు లోపల నల్ల కాగితాల కట్టలతో చూపించి మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్లేపల్లి వారిగూడేనికి చెందిన వంగూరి జానయ్య మోసానికి గురవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ట్రాప్ వేసి తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు.
నిందితుడి నుంచి బ్లాక్ కలర్ కాగిత కట్టలు, కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. రెడ్‌మీ మొబైల్ ఫోన్, నాలుగు అసలు 500 నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సల్మాన్ ఉమా డాలియా అలియాస్ గోయిట సోంగలో అనే వెస్ట్ ఆఫ్రికా, మాలి దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చిన నిందితుడు బెంగళూరులో నివసిస్తూ వ్యాపారం చేస్తున్నాడు.
క్రైమ్ నం. 66/2026 కేసు నమోదు చేశారు పోలీసులు. BNS సెక్షన్స్ 318(4), 3(5) & ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నకిలీ కరెన్సీ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, లావాదేవీలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కేసు ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ వి. శంకర్, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
